ఎడారిగా మారిన సౌదీ అరేబియా..  

Arebia

ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద ఎడారుల్లో ఒకటిగా ఉన్న సౌదీ అరేబియా ఒకప్పుడు నదులు, సరస్సులు, పచ్చిక బయళ్లు, అడవులతో కళకళలాడిన ప్రాంతమని తాజా పరిశోధనలు వెల్లడించాయి. ఆ కాలంలో  అనేక జంతువులు, మొక్కలు, అలాగే తొలి మానవులు నివసించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూగర్భ శాస్త్రవేత్తలు, వాతావరణ శాస్త్రవేత్తలు అవక్షేపాలు (సెడిమెంట్లు), శిలాజాలు, ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి ఈ ప్రాచీన పర్యావరణ వ్యవస్థను పునర్నిర్మించారు.

ఇసుకలో దాగిన చరిత్ర

ప్రస్తుతం అంతులేని ఇసుకతో నిండిన రుబ్ అల్ ఖాలి  ఎడారి ఒకప్పుడు భారీ సరస్సుతో నిండివుందని పరిశోధనలు చెబుతున్నాయి. వేలాది చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన పచ్చిక బయళ్లు, నదులు, నీటి వనరులు ఈ ప్రాంతాన్ని జీవంతో నింపాయి. ఇక్కడ లభించిన పురాతన నదీ మార్గాలు, సరస్సుల అవక్షేపాలు, అలాగే హిప్పోలు, మొసళ్ల శిలాజాలు ఒకప్పుడు ఈ ప్రాంతంలో సమృద్ధిగా నీరు ఉండేదనే విషయాన్ని నిర్ధారిస్తున్నాయి.

వర్షాలతో పచ్చబడిన ఎడారి

భూమి కక్ష్యలో వచ్చే మార్పులు, రుతుపవనాల ప్రభావంతో అరేబియాలో తడి, పొడి వాతావరణ దశలు మారుతూ వచ్చాయి. తేమ అధికంగా ఉన్న కాలాల్లో భారీ వర్షాలు కురిసి నదులు, సరస్సులు ఏర్పడ్డాయి. దీంతో ఎడారులు సారవంతమైన మైదానాలుగా మారాయి. అనంతరం వాతావరణం పొడిబారడంతో నీటి వనరులు ఎండిపోయి, మళ్లీ ఇసుక ఎడారులు విస్తరించాయి.

జీవంతో కళకళలాడిన అరేబియా

ఆ పచ్చని అరేబియాలో కేవలం వృక్షసంపద మాత్రమే కాకుండా అనేక రకాల జీవజాలం కూడా అభివృద్ధి చెందింది. హిప్పోలు,  మొసళ్లు,  గజెల్ జింకలుఇతర జంతువులుసంచరించేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 తొలి మానవుల వలసలకు మార్గం

ఎండిపోయిన పురాతన నదీ మార్గాల వద్ద పురావస్తు శాస్త్రవేత్తలు రాతి పనిముట్లు, ఇతర అవశేషాలను కనుగొన్నారు. వీటి ఆధారంగా తొలి మానవులు ఆఫ్రికా నుంచి యూరేషియా వైపు వలస వెళ్లేందుకు అరేబియాను ప్రధాన మార్గంగా ఉపయోగించినట్లు భావిస్తున్నారు. ఆ కాలంలో నదులు, పచ్చిక బయళ్లు ఆఫ్రికా-యూరేషియా ఖండాలను అనుసంధానించే సహజ మార్గాలుగా పనిచేశాయి.

శాస్త్రవేత్తలు ఎలా గుర్తించారు?

ఈ ప్రాచీన చరిత్రను వెలికితీయడానికి శాస్త్రవేత్తలు పలు ఆధునిక పద్ధతులను ఉపయోగించారు. భూగర్భ శాస్త్ర పరిశోధనలు,  పురాతన వాతావరణ (పాలియోక్లైమేట్) అధ్యయనాలు,  ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ క్షేత్రస్థాయి సర్వేలు..  ఈ సమాచారం ఆధారంగా అరేబియా గతంలో పచ్చగా మారిన దశలను మ్యాప్ చేశారు.

ప్రస్తుత వాతావరణ మార్పులకు ఉపయోగపడే అధ్యయనం

ఈ పరిశోధన కేవలం గతాన్ని తెలుసుకోవడానికే కాదు. వాతావరణ మార్పులకు ఎడారి ప్రాంతాలు ఎలా స్పందిస్తాయో అర్థం చేసుకోవడంలో కూడా కీలకంగా ఉపయోగపడుతోంది. ఈ అవగాహనతో సౌదీ అరేబియా సహా మధ్యప్రాచ్య దేశాలు అటవీకరణ, నీటి వనరుల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.