విద్యార్థుల ఉద్యమంపై విష ప్రచారం ఆపాలి

Cpi 30.7
  • బీజేపీ  ఎంపీ కంగనా రనౌత్ అరెస్టు చేయాలి 
  • అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబర్లపై కేసులు పెట్టాలి 
  • బిజెపిలోని 39 శాతం క్రిమినల్ ఎంపీలపై చర్యలేవీ?
  • రాష్ట్రంలో కరువు విలయతాండవం
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

విజయవాడ: నీట్ పేపర్ లీక్ కుంభకోణానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా సాగిన విద్యార్థి, యువజన ఉ ద్యమాన్ని అపహాస్యం చేస్తూ బీజేపీ నాయకులు, మోదీ అనుకూల మీడియా, సామాజిక మాధ్యమాలు సాగిస్తున్న విషప్రచారంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. విద్యార్థి ఉద్యమాన్ని వక్రీకరిస్తూ అసత్యాలు ప్రసారం చేస్తున్న యూట్యూబర్లు, బిజెపి అనుకూల సోషల్మీడియా నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను గట్టర్ జనరేషన్ (మురికి కాల్వల తరం)గా అవమానిస్తూ వ్యాఖ్యానించిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ను  వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి, ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

విజయవాడ దాసరి భవన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, యువజనులు నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా 45 రోజులపాటు ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నిర్వహించారని తెలిపారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం చర్చలకు రావాల్సి వచ్చిందన్నారు. ఉద్యమ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయడం, నీట్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం అందించడం, విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టడం వంటి ప్రధాన డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించినప్పటికీ, ఇప్పటివరకు  పురోగతి కనిపించడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల ఉద్యమాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ నాయకులు, మోదీ అనుకూల మీడియా అసత్య ప్రచారాన్ని ముమ్మరం చేయడం దుర్మార్గమని అన్నారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విద్యార్థుల ఉద్యమాన్ని అవమానించేలా చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామిక విలువలను కించపరచడమేనని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై స్పందించాల్సిన ప్రజాప్రతినిధులు, ప్రజా ఉ ద్యమాలను అవహేళన చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు.

విద్యార్ధి ఉద్యమంలో పాల్గొన్న వారిలో 2,873 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చూపిస్తూ ఉద్యమాన్ని అపఖ్యాతిపాలు చేయాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు. దేశవ్యాప్తంగా ఉద్యమంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటే, కేసులు నమోదైన వారి సంఖ్య కేవలం 1.4 శాతం మాత్రమేనని విశ్లేషించారు. అదే సమయంలో లోక్ సభ లోనే గణనీయమైన సంఖ్యలో 46 శాతం క్రిమినల్ రికార్డులు కలిగి ఉన్న వారున్నారని తెలిపారు. అందులో అందులో బీజేపీ నుంచి గెలిచిన 240 మంది ఎంపీలలో 94 మందిపై అనగా 39 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉండగా, 63 మందిపై అనగా 26 శాతం తీవ్రమైన కేసులు నమోదయ్యాయని తెలిపారు. కంగనా రనౌత్పై మండిలోను 8 క్రిమినల్ కేసులు నమోదైన విషయాన్ని గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులు ఉన్న వారిలో ఈటెల రాజేందర్పై 45, బండి సంజయ్ కుమార్పై 42, రఘునందన్రావుపై 29, సీఎం రమేశ్పై 5 కేసులు నమోదయ్యాయని తెలిపారు. విద్యార్థులను ప్రశ్నించే ముందు తమ పార్టీ ప్రజాప్రతినిధుల పరిస్థితిపై బీజేపీ నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు బీజేపీ నాయకులపైనా అనేక కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రంలో కరువు పరిస్థితులు రోజురోజుకూ విషమిస్తున్నాయని ఈశ్వరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా ఈ సీజన్లో నమోదుకావాల్సిన వర్షపాతంతో పోలిస్తే భారీ లోటు ఏర్పడిందని, రాష్ట్రవ్యాప్తంగా 56 శాతం వర్షాభావం నమోదైందన్నారు. రైతులను కూటమి  ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కరువు పీడిత, వర్షాభావ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ సీపీఐ శ్రేణులు పర్యటించాలని, ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి. హరినాథ్ రెడ్డి, పి. దుర్గాభవాని, దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.