అంగారక గ్రహంపై ‘గ్రహాంతరవాసుల క్షిపణి’ ? 

Venus

– నాసా ఏమంటోంది?

మార్స్  గ్రహాన్ని అన్వేషిస్తున్న క్యూరియాసిటీ రోవర్ తీసిన ఓ పాత చిత్రం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా  మారింది. ఆ చిత్రంలో కనిపిస్తున్న పొడవైన రాతి ఆకారాన్ని యూఎఫ్‌ఓ పరిశోధకుడు స్కాట్ సి. వారింగ్ ‘గ్రహాంతరవాసులు ఉపయోగించిన పేలని క్షిపణి’గా అభివర్ణిస్తూ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు.   ఈ వస్తువు ఒకప్పుడు మార్స్‌పై అభివృద్ధి చెందిన నాగరికత మధ్య జరిగిన యుద్ధానికి నిదర్శనం కావచ్చని, ఈ విషయం సైనికపరంగా కీలకమైనదని భావించి అంతరిక్ష సంస్థలు మౌనం పాటిస్తున్నాయని పేర్కొన్నారు.  ఇది అత్యాధునిక గ్రహాంతరవాసుల ఆయుధ సాంకేతికతకు సంబంధించిన అవశేషం కావచ్చని, దానిని స్వాధీనం చేసుకునేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడతాయని కూడా ఊహించారు. అయితే, ఈ వాదనలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని నాసా స్పష్టం చేసింది. ఆ వస్తువు సహజసిద్ధంగా ఏర్పడిన రాతి నిర్మాణమే తప్ప, అది క్షిపణి లేదా గ్రహాంతరవాసుల సాంకేతిక అవశేషమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది.

రాయి మాత్రమేనా?

శాస్త్రవేత్తల ప్రకారం, మార్స్‌పై కోట్లాది సంవత్సరాలుగా అగ్నిపర్వత కార్యకలాపాలు, ఉల్కాపాతాలు, గాలివల్ల జరిగే కోత (ఎరోషన్) వంటి ప్రక్రియలు కొనసాగుతున్నాయి. వీటి కారణంగా రాళ్లు కొన్నిసార్లు మనిషి తయారు చేసిన వస్తువుల్లా కనిపించే విచిత్ర ఆకారాలు ఏర్పడతాయని అంటున్నారు.  ఈ పరిస్థితిని “పరైడోలియా ” అంటారు. అంటే, అసలు ఏమీ లేని చోట మన మెదడు తెలిసిన ఆకారాలను కానీ  వస్తువులను ఊహించుకోవడం అన్నమాట.  గతంలో కూడా మార్స్‌పై కనిపించిన అనేక రాళ్లు, కొండలు, గుహలు, ముఖాకారాలు మొదట గ్రహాంతరవాసుల నిర్మాణాలుగా ప్రచారం పొందినా, తర్వాత అవన్నీ సహజసిద్ధమైన భౌగోళిక నిర్మాణాలేనని తేలింది.

ఎనిమిది అడుగుల ‘క్షిపణి’?

ఆ వస్తువు  ఎనిమిది అడుగుల పొడవు ఉండవచ్చు. అది చెక్కుచెదరకుండా ఉన్న గ్రహాంతరవాసుల సాంకేతిక పరికరం కావచ్చని వారింగ్  ఊహించారు. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలను  సమర్పించలేదు. మరోవైపు, కొందరు సోషల్ మీడియా వినియోగదారులు అది కూలిపోయిన గ్రహాంతరవాసుల అంతరిక్ష నౌక కావచ్చని కామెంట్స్ చేస్తున్నారు . ఒక నెటిజన్ ఐతే  దానిలో రెండు భాగాలు కనిపిస్తున్నాయని, ఒకటి ఖాళీగా ఉండగా మరొకదాంట్లో “ప్యాకేజీలు” ఉన్నట్లుగా కనిపిస్తోందని, విరిగిపోయిన రెక్కలతో అది విమానంలా ఉందని అభిప్రాయపడ్డారు. మరికొందరు “అది నిజంగా కూలిపోయిన అంతరిక్ష నౌక అయితే బాగుండేది” అని వ్యాఖ్యానించారు.

మార్స్‌పై ‘ఇల్లు’ కూడా?

ఇదే నెలలో వారింగ్ మరోసారి క్యూరియాసిటీ రోవర్ తీసిన చిత్రంలో మార్స్‌పై ఒక ఇంటి ప్రవేశ ద్వారం కనిపించిందని ప్రకటించారు. ఈ చిత్రం రోవర్ 2012 నుంచి పరిశోధనలు చేస్తున్న గేల్ క్రేటర్ ప్రాంతంలో తీసిన పనోరమా ఫొటోలో నమోదైంది. దూరంలో కనిపిస్తున్న ఒక నిర్మాణం మట్టి గోడలు, ప్రవేశ ద్వారం ఉన్న ప్రాచీన నివాసంలా ఉందని, ఒకప్పుడు మార్స్‌పై తెలివైన జీవులు నివసించారని ఆయన వాదించారు.

నాసా సమాధానం ఇదే

ఇలాంటి వాదనలకు గతంలోనే నాసా సమాధానం ఇచ్చింది. 2022లో క్యూరియాసిటీ రోవర్ చిత్రంలో కనిపించిన ‘తలుపు’ గురించి స్పందిస్తూ, అది సహజంగా ఏర్పడిన రాతి పగుళ్లలో ఒకటేనని తెలిపింది. భూమిపైన, మార్స్‌పైన కూడా ఇలాంటి పగుళ్లు సాధారణమేనని, అవి ఏ నిర్మాణానికి సంబంధించిన ప్రవేశ ద్వారాలు కావని నాసా వివరించింది.

జీవం ఆనవాళ్లు  లేవు

మార్స్‌పై ప్రస్తుతానికి లేదా గతంలో గ్రహాంతరవాసుల జీవం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని నాసా ఇప్పటికీ చెబుతోంది. క్యూరియాసిటీ రోవర్ ప్రధాన లక్ష్యం కూడా మార్స్‌పై ఎప్పుడైనా సూక్ష్మజీవులు నివసించాయా అనే విషయాన్ని తెలుసుకోవడమే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చిత్రాలపై చర్చ కొనసాగుతున్నప్పటికీ, శాస్త్రీయంగా చూస్తే అవి కేవలం సహజసిద్ధమైన రాతి నిర్మాణాలేనని నిపుణులు పేర్కొంటున్నారు. గ్రహాంతరవాసుల యుద్ధం, క్షిపణులు లేదా రహస్య స్థావరాలపై ఇప్పటివరకు ఎలాంటి విశ్వసనీయ ఆధారాలు లభించలేదు.