డైనోసార్లు  చిన్నగా ఎందుకు కావు ? 

123456

– అసలు కారణం క్షీరదాలేనా?

భూమిపై కోట్ల ఏళ్ల పాటు ఆధిపత్యం చెలాయించిన డైనోసార్లు.. భారీ పరిమాణంతో ఉండేవి . ఐతే అవి ఎలకల్లా ఎందుకు చిన్నగా ఉండవు అనే ప్రశ్న చాలామందిలో వస్తూ ఉంటుంది.  ఈ ప్రశ్నకు తాజాగా ఓ అధ్యయనం ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది . చిన్న క్షీరదాలతో పోటీ కారణంగానే డైనోసార్లు  చిన్న పరిమాణాలకు పరిణామం చెందలేకపోయి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

ఎవల్యూషన్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో వివిధ జంతు సమూహాల్లో శరీర పరిమాణం ఎలా పరిణామం చెందిందో పరిశీలించారు. శక్తి వినియోగం, పునరుత్పత్తి వంటి అంశాల ఆధారంగా రూపొందించిన గణిత నమూనాల ప్రకారం.. డైనోసార్లు జీవశాస్త్రపరంగా చాలా చిన్న పరిమాణాలకు కూడా పరిణామం చెందగలిగే అవకాశం ఉంది. కానీ శిలాజ ఆధారాలు మాత్రం అందుకు భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి.

అతి చిన్న డైనోసార్లు కూడా పెద్దవే

ఇప్పటివరకు గుర్తించిన అతి చిన్న పక్షియేతర డైనోసార్లలో మైక్రోరాప్టర్, యాంకియోర్నిస్, ఫ్రూటాడెన్స్ ఉన్నాయి. మైక్రోరాప్టర్ బరువు సుమారు 430 గ్రాములు. అంటే పెద్ద కాకి పరిమాణంలో ఉండేది. యాంకియోర్నిస్ బరువు దాదాపు 530 గ్రాములు కాగా, ఫ్రూటాడెన్స్ సుమారు 730 గ్రాముల బరువు ఉండేది. టీ-రెక్స్ లేదా భారీ పొడవాటి మెడ కలిగిన డైనోసార్లతో పోలిస్తే ఇవి చాలా చిన్నవే. కానీ నేటి అత్యంత చిన్న జీవులతో పోలిస్తే మాత్రం ఇవి చాలా పెద్దవి. ఉదాహరణకు, ప్రపంచంలోనే అతి చిన్న పక్షిగా పేరున్న బీ హమ్మింగ్‌బర్డ్ బరువు కేవలం 1.75 గ్రాములు. ప్రపంచంలో శరీర బరువు పరంగా అతి చిన్న క్షీరదమైన ఎట్రుస్కన్ ష్రూ బరువు సుమారు 1.8 గ్రాములు మాత్రమే. అంటే డైనోసార్లలో చిన్న జాతులు ఉన్నప్పటికీ.. అవి నేటి చిన్న జీవులతో పోలిస్తే వందల రెట్లు బరువుగా ఉండేవి.

చిన్న జీవుల స్థానం క్షీరదాలదేనా?

ఈ తేడా పాలియోంటాలజిస్టులను చాలా కాలంగా ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే ఆధునిక పర్యావరణ వ్యవస్థల్లో చిన్న శరీర పరిమాణం కలిగిన జంతువులు చాలా సాధారణం. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, డైనోసార్ల కాలంలో చిన్న జంతువుల కోసం ఉన్న పర్యావరణ స్థానాన్ని ప్రారంభ క్షీరదాలు ఆక్రమించి ఉండవచ్చు. డైనోసార్ల కాలంలో అనేక క్షీరదాలు ష్రూ వంటి చిన్న పరిమాణంలో ఉండేవి. అవి కీటకాలు, విత్తనాలను ఆహారంగా తీసుకుంటూ జీవించేవి. చిన్న శరీరాలకు అనుకూలమైన పర్యావరణాల్లో అవి ఇప్పటికే తమ స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. దీంతో డైనోసార్లు కూడా అదే ప్రాంతాల్లోకి వచ్చి చిన్న పరిమాణంలో జీవించడానికి అవకాశాలు తగ్గి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

పోటీ రెండు వైపులా పనిచేసిందా?

ఆసక్తికరంగా ఈ పోటీ ఒకే దిశలో జరగలేదని అధ్యయనం సూచిస్తోంది. చిన్న క్షీరదాలు డైనోసార్లు మరింత చిన్నగా మారకుండా అడ్డుకుని ఉండవచ్చు. అదే సమయంలో భారీ డైనోసార్లు ఆక్రమించిన పెద్ద శరీర పరిమాణాల పర్యావరణ స్థానాల్లోకి క్షీరదాలు సులభంగా ప్రవేశించలేకపోయాయి. అంటే డైనోసార్లు పెద్ద జంతువుల ప్రపంచంలో ఆధిపత్యం చెలాయిస్తే.. క్షీరదాలు చిన్న జంతువుల ప్రపంచంలో తమ స్థానాన్ని బలంగా ఏర్పరచుకున్నాయన్నమాట.

66 మిలియన్ ఏళ్ల క్రితం ఏం జరిగింది?

ఈ సిద్ధాంతం 66 మిలియన్ ఏళ్ల క్రితం జరిగిన గ్రహశకల ప్రభావం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను అర్థం చేసుకోవడంలో కూడా ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆ గ్రహశకల ప్రభావం తర్వాత పక్షులు మినహా మిగిలిన డైనోసార్లు అంతరించిపోయాయి. దీంతో పర్యావరణ వ్యవస్థల్లో పెద్ద జంతువులు ఆక్రమించిన అనేక స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ అవకాశాన్ని క్షీరదాలు వేగంగా ఉపయోగించుకున్నాయి. అవి క్రమంగా పెద్ద పరిమాణాలకు పరిణామం చెంది.. గతంలో డైనోసార్లు ఆక్రమించిన అనేక పర్యావరణ స్థానాల్లోకి ప్రవేశించాయి.

అయితే పక్షులు ఎలా చిన్నవయ్యాయి?

డైనోసార్లలో మాత్రం ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది. అదే పక్షులు. పక్షులు చిన్న థెరోపాడ్ డైనోసార్ల నుంచి పరిణామం చెందాయి. శిలాజ ఆధారాల ప్రకారం సుమారు 120 మిలియన్ ఏళ్ల క్రితమే కొన్ని ప్రారంభ పక్షులు చాలా చిన్న పరిమాణాలకు చేరుకున్నాయి. దీనికి ఎగరగలిగే సామర్థ్యం ఒక కారణం కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఎగరడం వల్ల ఇతర చిన్న డైనోసార్లు ఎదుర్కొన్న పోటీ నుంచి పక్షులు కొంతవరకు తప్పించుకుని కొత్త ప్రాంతాల్లోకి, కొత్త శరీర పరిమాణాల్లోకి విస్తరించే అవకాశం లభించి ఉండవచ్చు. నేడు ప్రపంచంలో 12,000కు పైగా పక్షి జాతులు ఉన్నాయి. వాటిలో అనేక జాతుల బరువు కేవలం కొన్ని గ్రాములు మాత్రమే.

డైనోసార్లు చిన్నగా  లేకపోవడానికి క్షీరదాలే ఏకైక కారణమని ఈ అధ్యయనం నిరూపించలేదు. ఇతర జీవశాస్త్ర, పర్యావరణ, పరిణామ కారకాలు కూడా ప్రభావం చూపి ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అయినప్పటికీ, ఈ పరిశోధన డైనోసార్ల చరిత్రలోని ఓ ఆసక్తికరమైన ప్రశ్నకు కొత్త వివరణను అందిస్తోంది. డైనోసార్లు భూమిపై అతి పెద్ద జీవులుగా పరిణామం చెందాయి.. కానీ ఎలుకలంత చిన్నగా మాత్రం దాదాపు ఎప్పుడూ మారలేదు. చిన్న క్షీరదాలతో జరిగిన పోటీకి ఇందులో కీలక పాత్ర ఉండి ఉండవచ్చు.