ప్రపంచంలోనే అత్యంత పురాతన దేశాలు ఇవే.

World

– భారత్‌కు ఎన్నో వేల ఏళ్ల చరిత్ర!

ప్రపంచంలో వేల ఏళ్ల చరిత్ర కలిగిన దేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ దేశాలు కేవలం పురాతనమైనవే కాకుండా.. మానవ నాగరికత, సంస్కృతి, శాస్త్ర విజ్ఞానం, పాలనా వ్యవస్థలు, కళలు, సంప్రదాయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. వాటి ప్రభావం నేటికీ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, జనాభా తదితర అంశాలపై గణాంకాలను పంచుకునే  వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్  ఇటీవల  విడుదల చేసిన జాబితాలో పురాతన మూలాలు కలిగిన దేశాలను ప్రస్తావించారు. ఆయా దేశాల ప్రారంభ చరిత్ర ఆధారంగా వాటి వయసును అంచనా వేశారు.

ఇరాన్.. 5,226 ఏళ్లు

ఈ జాబితాలో ఇరాన్ మొదటి స్థానంలో ఉంది. గతంలో పర్షియా అని పిలిచే ఇరాన్‌కు  5,226 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది . ప్రపంచంలోని పురాతన నిరంతర నాగరికతల్లో ఇదొకటి . గణితం, ఖగోళ శాస్త్రం, కళలు, పాలనా వ్యవస్థల్లో ఇరాన్‌ది కీలక పాత్ర.

ఈజిప్ట్ .. 5,126 ఏళ్లు

5,126 ఏళ్ల చరిత్రతో ఈజిప్ట్  రెండో స్థానంలో ఉంది. పిరమిడ్లు, ఫరోలు, పురాతన లిపి కారణంగా ఈజిప్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వ్యవసాయం, గణితం, వైద్యం వంటి రంగాల్లో పురాతన ఈజిప్షియన్లు  పురోగతి సాధించారు.

వియత్నాం .. 4,905 ఏళ్లు

వియత్నాంకు  4,905 ఏళ్ల చరిత్ర ఉంది .  రాజవంశాలు, రెడ్ రివర్ నాగరికత  ముఖ్యమైనవి. సాహిత్యం, సంగీతం, పండుగలు, సంప్రదాయాలు ఇప్పటికీ అక్కడి జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

 అర్మేనియా .. 4,518 ఏళ్లు

4,518 ఏళ్ల చరిత్రతో అర్మేనియా నాలుగో స్థానంలో ఉంది. క్రైస్తవ మతాన్ని తొలినాళ్లలోనే స్వీకరించిన దేశాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. పురాతన రాజ్యాలు, మఠాలు, ప్రత్యేకమైన అక్షరమాల అర్మేనియా చరిత్రలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

ఉత్తర కొరియా.. 4,359 ఏళ్లు

ఉత్తర కొరియా చరిత్రను  గోజోసియాన్ రాజ్యంతో  అనుసంధానిస్తారు.   దాని చరిత్ర   4,359 ఏళ్ళు . పురాతన కొరియా సమాజాల్లో పాలనా వ్యవస్థలు, లోహ పనితనం, కన్ఫ్యూషియన్ ఆలోచనల ఆధారిత విద్యకు ప్రాధాన్యం ఉండేది.

చైనా.. 4,096 ఏళ్లు

4,096 ఏళ్ల చరిత్రతో చైనా ప్రపంచంలోని పురాతన  నాగరికతల్లో ఒకటి. కాగితం, ముద్రణ, దిక్సూచి వంటి అనేక ముఖ్యమైన ఆవిష్కరణలు చైనా నుంచి వచ్చాయి. చైనా ఆలోచనలు, సంస్కృతి, పాలనా విధానాలు ఆసియాతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలపై కూడా ప్రభావం చూపాయి.

భారత్.. 4,026 ఏళ్లు

ఈ జాబితాలో  4,026 ఏళ్ల చరిత్రతో భారత్ ఏడో స్థానంలో ఉంది. భారతదేశ చరిత్రకు సింధు లోయ నాగరికతతో లోతైన సంబంధం ఉంది. పట్టణ ప్రణాళిక, వాణిజ్యం వంటి రంగాల్లో ఈ నాగరికత ప్రారంభ దశలోనే అభివృద్ధి సాధించింది. తర్వాతి కాలంలో భారత్‌లో అనేక మతాలు, భాషలు, తత్వాలు, శాస్త్రీయ ఆలోచనలు, సాంస్కృతిక సంప్రదాయాలు అభివృద్ధి చెందాయి. వీటి ప్రభావం నేటికీ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది.

జార్జియా.. 3,326 ఏళ్లు

3,326 ఏళ్ల చరిత్రతో జార్జియా ఈ జాబితాలో ఉంది. పురాతన రాజ్యాలకు నిలయంగా ఉన్న ఈ దేశం యూరప్, ఆసియా సంస్కృతుల కలయికకు ప్రసిద్ధి . పురాతన వైన్ తయారీ సంప్రదాయాలకు  జార్జియాకు  గుర్తింపు ఉంది.

ఇథియోపియా.. 3,006 ఏళ్లు

ఆఫ్రికాలోని పురాతన దేశాల్లో ఇథియోపియా ఒకటి.  3,006 ఏళ్ల చరిత్ర దీని సొంతం.  పురాతన రాజ్యాలతో పాటు మానవ పరిణామ చరిత్రతో కూడా ఈ ప్రాంతానికి సంబంధం ఉంది.

గ్రీస్.. 2,826 ఏళ్లు

2,826 ఏళ్ల చరిత్రతో గ్రీస్  కూడా పురాతన దేశాల్లో ఒకటి. ప్రజాస్వామ్యం, తత్వశాస్త్రం, కళలు, శాస్త్రం వంటి రంగాల్లో పురాతన గ్రీకు నాగరికత ప్రపంచంపై గొప్ప ప్రభావం చూపింది. ఒలింపిక్ క్రీడల సంప్రదాయానికి కూడా గ్రీస్‌నే మూలంగా భావిస్తారు.

జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్న దేశాల చరిత్ర ఇలా ఉంది

రష్యా .. 2,726 ఏళ్లు : విస్తారమైన  భూభాగంలో పురాతన మానవ నివాసాలు, వివిధ సంస్కృతుల కలయికతో ప్రత్యేక చరిత్ర  దీని సొంతం.

ఆఫ్ఘనిస్థాన్ .. 2,704 ఏళ్లు:  ఆసియాలోని వివిధ ప్రాంతాల మధ్య ఉన్న భౌగోళిక స్థానం కారణంగా ఎన్నో సంస్కృతులకు కలయిక కేంద్రంగా నిలిచింది.

 జపాన్.. 2,686 ఏళ్లు: దీర్ఘకాలంగా కొనసాగుతున్న రాజరిక వ్యవస్థ, సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రసిద్ధి.

 మంగోలియా.. 2,235 ఏళ్లు: సంచార జీవన విధానం, శక్తివంతమైన సామ్రాజ్యాలతో సుదీర్ఘ చరిత్ర.

 థాయ్‌లాండ్.. 1,426 ఏళ్లు: పురాతన వ్యవసాయ సమాజాలు, లోహ పనితనం వంటి అంశాలు ప్రారంభ నాగరికత అభివృద్ధిలో కీలకంగా నిలిచాయి.