అమ్మో దెయ్యం కత్తి

Knife

– 200 ఏళ్లుగా సరస్సులో దాగిన కత్తి..
– ‘కెంట్ ఎక్స్‌క్యాలిబర్’ అంటూ వైరల్!

ఇంగ్లాండ్‌లోని ఓ కోట సమీపంలోని సరస్సు నీటిమట్టం భారీగా తగ్గడంతో 200 ఏళ్లుగా నీటిలో దాగి ఉన్న ఓ పురాతన కత్తి బయటపడింది. స్థానికంగా దీనికి ‘కెంట్ ఎక్స్‌క్యాలిబర్’ అనే పేరు వచ్చింది. ఈ ఘటన కెంట్‌లోని ఈడెన్‌బ్రిడ్జ్ సమీపంలోని చిడ్డింగ్‌స్టోన్ క్యాజిల్ వద్ద జరిగింది. తీవ్రమైన ఎండలు, కరువు కారణంగా కోట సరస్సులో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. చెట్ల నుంచి పడిన కొమ్మలను తొలగిస్తున్న ఇద్దరు వాలంటీర్లకు నీటిలో లోహపు వస్తువు కనిపించింది. వారు గ్రాప్లింగ్ హుక్ సహాయంతో దాన్ని బయటకు తీసి కోట క్యూరేటర్ నవోమి కొలిక్కు అప్పగించారు. కత్తిని చూసిన ఆమె ఆశ్చర్యపోయారు. కోట ప్రాంగణంలో ఇలాంటి వస్తువు ఇప్పటివరకు దొరకలేదని తెలిపారు.

కత్తి ఎవరిది?

ప్రస్తుతం ఈ కత్తి అసలు ఎవరిదన్నది మిస్టరీగానే ఉంది. ప్రాథమిక పరిశోధన ప్రకారం ఇది 1800ల ప్రారంభానికి చెందిన విక్టోరియన్ బ్యాండ్స్‌మన్ కత్తి అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇలాంటి కత్తులను సైనిక బ్యాండ్లలో వేడుకలు, అధికారిక కార్యక్రమాల సమయంలో ఉపయోగించేవారు. కత్తి హ్యాండిల్‌పై బంగారు పూతతో ఉన్న అలంకరణ, చివరలో సింహం ఆకృతి కనిపిస్తోంది. ఈ భాగం ఇత్తడితో తయారై ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే వంకరగా ఉన్న బ్లేడ్ మాత్రం తుప్పు పట్టి, సరస్సులోని బురదతో కప్పబడి ఉంది. ప్రస్తుతం కత్తిని యాసిడ్ లేని ప్రత్యేక కాగితంలో చుట్టి, గ్లౌజులు ధరించి మాత్రమే పరిశీలిస్తున్నారు.

ఆర్ట్ డీలర్‌ది కావచ్చా?

కోటకు గతంలో యజమానిగా ఉన్న డెనిస్ ఐర్ బోవర్ అనే కళా వ్యాపారికి కత్తులను సేకరించే అలవాటు ఉండేదట. దీంతో ఇది అతని సేకరణలోని కత్తి అయి ఉండొచ్చనే మరో అనుమానం ఉంది. అలాగే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అక్కడ మోహరించిన సైనికులకు ఈ కత్తి చెందినదై ఉండొచ్చనే మరో వాదన ఉంది.

మరి దెయ్యం కత్తి అయితే?

ఈ కత్తి చుట్టూ స్థానికంగా ఉన్న కథలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. సరస్సులో ఓ సైనికుడు మునిగిపోయాడని, అతని ఆత్మ ఇప్పటికీ అక్కడ తిరుగుతుందని స్థానిక కథనం ఉంది. అందుకే ఇది ఆ సైనికుడి కత్తి అయి ఉండొచ్చనే మిస్టరీ థియరీ కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే దీనికి ఎలాంటి చారిత్రక ఆధారాలు ఉన్నాయో ఇంకా స్పష్టంగా తెలియదు.

కరువు వల్ల బయటపడిన చరిత్ర

కోట సిబ్బంది ఇప్పటికే ఇతర మ్యూజియంలు, చరిత్ర నిపుణులను సంప్రదిస్తున్నారు. కోట ఆర్కైవ్స్‌లోని పాత రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు.ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని చాలా ప్రాంతాలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. తీవ్రమైన వేడి కారణంగా చిడ్డింగ్‌స్టోన్ క్యాజిల్ పరిసరాల్లోని పచ్చిక కూడా ఎండిపోయింది. చెట్లు కూడా సాధారణ సమయం కంటే ముందుగానే ఆకులు రాలుస్తున్నాయి. నీటిమట్టం మరింత తగ్గితే సరస్సులో నుంచి ఇంకేమైనా పురాతన వస్తువులు బయటపడే అవకాశం ఉందని కోట సిబ్బంది భావిస్తున్నారు. అసలు ఈ కత్తి ఎవరిది? ఎప్పుడు సరస్సులో పడింది? అనే ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు ‘కెంట్ ఎక్స్‌క్యాలిబర్’ మిస్టరీ కొనసాగనుంది.