నిశ్చింతగా ఉండటమే జీవితం
మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. మనం ఎంతగా ప్రయత్నించినా కొన్ని విషయాలు మనకు దక్కవు. అదే సమయంలో మనం ఊహించని కొన్ని అవకాశాలు, పరిచయాలు, విజయాలు మనల్ని వెతుక్కుంటూ వస్తుంటాయి. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకున్నప్పుడు జీవితంపై మన దృష్టే మారిపోతుంది.
‘నీకు రాసి పెట్టి ఉన్నది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీకు ప్రాప్తం లేనిది నీ అరిచేతిలో ఉన్నా జారిపోతుంది’ అనే మాటలో జీవిత సత్యం దాగి ఉంది. మనిషి తనకు కావాల్సినది దక్కకపోతే నిరాశ చెందుతాడు. దక్కిన దాన్ని కోల్పోతే బాధపడతాడు. కొన్ని సందర్భాల్లో మనం కోల్పోయినదే భవిష్యత్తులో మనకు మేలు చేసే మార్పుకు కారణమవుతుంది.
జీవితంలో ప్రతిదీ మన నియంత్రణలో ఉండదు. మన శ్రమ, నిర్ణయాలు, ఆలోచనలు మన చేతుల్లో ఉంటాయి. కానీ ఫలితం మాత్రం ఎప్పుడూ మన అంచనాల ప్రకారం ఉండకపోవచ్చు. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, వెళ్లిపోయిన ప్రతి విషయాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి.
ఏదైనా మనకు దక్కినప్పుడు అది శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. అలాగే ఏదైనా మన నుంచి దూరమైనప్పుడు ఇక జీవితంలో ఏమీ మిగలలేదని భావించకూడదు. ఒక తలుపు మూసుకుపోతే మరో మార్గం తెరుచుకునే అవకాశం ఉంటుంది. మనం చూడలేని దారుల్లో కూడా జీవితం మన కోసం కొత్త అవకాశాలను సిద్ధం చేస్తుంది. అందుకే ప్రతి విషయాన్ని అతిగా ఆలోచిస్తూ మనశ్శాంతిని కోల్పోవడం కంటే, పరిస్థితులను స్వీకరించి ముందుకు సాగడం మంచిది. గెలుపు వచ్చినా పొంగిపోకుండా, ఓటమి ఎదురైనా కుంగిపోకుండా సమతుల్యతతో ఉండ గ లిగినప్పుడే నిజమైన ప్రశాంతత లభిస్తుంది. మనిషి చేతిలో ఉన్నది ప్రయత్నం మాత్రమే.. ప్రతి ఫలితం కాదు. కాబట్టి మన వంతు కృషి చేద్దాం. వచ్చినదాన్ని ఆనందంగా స్వీకరిద్దాం
