- “అమ్మా… ఐదు నిమిషాలు మాట్లాడతావా?” పదేళ్ల ప్రియ అడిగిన ఆ ప్రశ్న విన్నా, ఆమె తల్లి అమూల్య చెవిలో పూర్తిగా పడలేదు. ఆమె చూపు ఫోన్ స్క్రీన్‌పైనే ఉంది. ఆఫీస్ మెసేజ్‌లు, సోషల్ మీడియా నోటిఫికేషన్‌లు, వాట్సాప్ గ్రూప్ సందేశాలు… ఆమె వేళ్లు ఆగకుండా కదులుతున్నాయి. “ఒక్క నిమిషం …” అని చెప్పింది. ఆ ఒక్క నిమిషం గంటగా మారింది. ప్రియ నెమ్మదిగా తన గదిలోకి వెళ్లిపోయింది. ఆ ఇంట్లో నలుగురు మనుషులు ఉన్నారు. కానీ మాటలు మాత్రం చాలా తక్కువ. వారికి ఫోన్ పైనే ధ్యాస ఎక్కువ. ఇలాంటి ఘటనలు తరచూ మనకు తారసపడుతుంటాయి.
ఒకప్పుడు ఇంటి గుమ్మం వద్ద సాయంత్రం కూర్చొని కబుర్లు చెప్పుకోవడం జీవితంలో భాగంగా కనిపించేది. పల్లెటూరిలో అయితే రచ్చబండ కబుర్లు వినిపించేవి. పొరుగింటి కష్టసుఖాలు తెలుసుకునేవాళ్లు. ఇంట్లో పెద్దలు చెప్పే అనుభవాలు, పిల్లలు చెప్పే పాఠశాల విశేషాలు, కుటుంబ సభ్యుల మధ్య జరిగే చిన్న చిన్న సంభాషణలు అనుబంధాలను మరింత బలపరిచేవి. ఇప్పుడు కాలం మారింది. మనిషి చేతిలో ప్రపంచమంతా చేరింది. కానీ అదే సమయంలో మనసుల మధ్య దూరం కూడా పెరిగింది.
నేటి సాంకేతిక యుగంలో స్మార్ట్‌ఫోన్ మనిషి జీవితంతో విడదీయరాని బంధమేర్పడింది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఫోన్‌ను పక్కనే పెట్టుకుంటున్నాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయం చాలా తగ్గిపోతోంది. ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సమయం ఉన్నా ఫోన్ చూసుకోవడానికే ఇష్టపడుతున్నారు.. తల్లిదండ్రులు తమ పనుల్లో, పిల్లలు తమ గాడ్జెట్లలో, యువత సోషల్ మీడియా ప్రపంచంలో మునిగిపోతున్నారు.
ఇటీవల ఒక ఆసక్తికరమైన దృశ్యం తరచూ ఎదురవుతోంది. ఒక కుటుంబం వీకెండ్లో రెస్టారెంట్‌కు వెళ్తుంది. అక్కడ టేబుల్ చుట్టూ నలుగురైదుగురు కూర్చుంటారు. వారి చూపులన్నీ ఫోన్ స్క్రీన్‌లపైనే ఉంటాయి. ఎదుట కూర్చున్న మనిషితో మనసువిప్పి మాట్లాడటం కంటే, ఎక్కడో ఉన్న వ్యక్తి పంపిన సందేశానికి సమాధానం ఇవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది కేవలం ఒక కుటుంబం కథ కాదు ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న వాస్తవం.
సాంకేతికతతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దూరంగా ఉన్న వారితో క్షణాల్లో మాట్లాడే అవకాశం వచ్చింది. ప్రపంచ సమాచారమంతా వేళ్ల చివరికి చేరింది. దీన్ని వినియోగించుకుని అద్భుతాలు సృష్టించవచ్చు. కానీ సెల్ మాయలో పడి మానవ సంబంధాలకు దూరమవుతున్నారు. వర్చువల్ సంబంధాలు పెరుగుతున్న కొద్దీ ప్రత్యక్ష సంబంధాలు బలహీనపడుతున్నాయి.
ప్రధానంగా పిల్లల్లో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఇంట్లో తల్లిదండ్రులతో గడిపే సమయం తగ్గిపోవడంతో భావోద్వేగ అనుబంధాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. పెద్దల అనుభవాలు వినే అవకాశం తగ్గుతోంది. స్నేహితులతో ఆడుకునే మైదానాలు ఖాళీ అవుతున్నాయి. వాటి స్థానంలో మొబైల్ స్క్రీన్‌లు, వీడియో గేమ్‌లు, సోషల్ మీడియా వేదికలు వచ్చి చేరాయి.
మనిషికి కేవలం సమాచార మార్పిడి మాత్రమే సరిపోదు. అతనికి ఆప్యాయత కావాలి, పలకరింపు కావాలి, తన మాట వినే మనసు కావాలి. ఒక చిరునవ్వు, ఒక భుజం తట్టడం, కష్టసమయంలో ఓదార్పు చెప్పే మాట — ఇవి ఏ సాంకేతిక సాధనం ఇవ్వలేవు. అవి కేవలం మానవ సంబంధాల్లోనే దొరుకుతాయి.
సాంకేతిక సౌకర్యాన్ని వదిలేయడం పరిష్కారం కాదు. దానిని సద్వినియోగం చేసుకుంటూనే, కుటుంబానికి, స్నేహితులకు, సమాజానికి సమయం కేటాయించడం అవసరం. రోజులో కొంతసేపైనా ఫోన్‌ను పక్కన పెట్టి మనుషులతో మాట్లాడితేనే సంబంధాలు సజీవంగా ఉంటాయి.
సాంకేతికత మన చేతులను కలిపింది. ప్రపంచాన్ని దగ్గర చేసింది. కానీ హృదయాలను దగ్గర చేయాలంటే ఇంకా మనిషే ముందుకు రావాలి. లేదంటే చేతిలో ప్రపంచం ఉన్నా, మనసులో ఒంటరితనం మాత్రమే మిగిలిపోతుంది. ఇది నేటి సమాజం ముందు నిలిచిన మౌన సత్యం.
