నిశ్శబ్ద వ్యాధి.. నిర్లక్ష్యం చేయొద్దు

5555
  • ఆస్టియో ఆర్థరైటిస్‌, ఆస్టియోపోరోసిస్‌పై అవగాహన అవసరం
  • ఎముకలు, కీళ్ల శస్త్రవైద్య నిపుణుడు డాక్టర్‌ వై. మహేష్‌

విజయవాడ: వయసుతోపాటు జీవనశైలిలో మార్పులు, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహార లోపం కారణంగా కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలు పెరుగుతున్నాయని ప్రముఖ ఎముకలు, కీళ్ల శస్త్రవైద్య నిపుణుడు డాక్టర్‌ వై. మహేష్‌ తెలిపారు. ఆస్టియో ఆర్థరైటిస్‌, ఆస్టియోపోరోసిస్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.

వాసవ్య నర్సింగ్‌ హోంలో డాక్టర్‌ సమరం అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఆరోగ్య సదస్సులో డాక్టర్‌ మహేష్‌ ప్రసంగించారు. ఆస్టియో ఆర్థరైటిస్‌ ప్రధానంగా మోకాళ్లు, నడుము, తుంటి, చేతుల కీళ్లను ప్రభావితం చేస్తుందని చెప్పారు. కీళ్లలో నొప్పి, బిగుతు, కదలికలో ఇబ్బంది, మెట్లు ఎక్కేటప్పుడు లేదా ఎక్కువసేపు నడిచినప్పుడు నొప్పి పెరగడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలని వివరించారు.

వయసు పెరిగేకొద్దీ కొందరిలో ఎముకల సాంద్రత, బలం తగ్గి అవి పెళుసుగా మారే పరిస్థితినే ఆస్టియోపోరోసిస్‌ అంటారని తెలిపారు. ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడంతో దీనిని ‘నిశ్శబ్ద వ్యాధి’గా పరిగణిస్తారని చెప్పారు. ముఖ్యంగా వృద్ధుల్లో తుంటి, వెన్నెముక, మణికట్టు ఎముకలు విరగడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరించారు.

ఈ సమస్యలను నివారించేందుకు సమతుల్య ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామం, సరైన శరీర బరువు, తగినంత కాల్షియం, విటమిన్‌–డి, సూర్యరశ్మి అవసరమన్నారు. పొగతాగడం, అధిక మద్యపానానికి దూరంగా ఉండాలని సూచించారు. కీళ్ల సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతో నడక, ఈత, సైక్లింగ్‌ వంటి తక్కువ ప్రభావం కలిగిన వ్యాయామాలు చేయాలన్నారు. ఎముకలు, కండరాల బలానికి బరువును మోసే వ్యాయామాలు ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు.

వృద్ధులు ఇంట్లో జారిపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే కంటి చూపు, ఎముకల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నిరంతర కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, ఎత్తు తగ్గడం లేదా చిన్న దెబ్బకే ఎముక విరగడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. వైద్యుల సూచన మేరకు అవసరమైన వారు ఎముకల సాంద్రతను తెలుసుకునేందుకు డెక్సా స్కాన్‌ చేయించుకోవాలని చెప్పారు. చిన్న వయసు నుంచే ఎముకలు, కీళ్ల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ద్వారా భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించవచ్చని డాక్టర్‌ మహేష్‌ పేర్కొన్నారు. అనంతరం సదస్సులో పాల్గొన్న వారి సందేహాలను నివృత్తి చేశారు.