గ్రామం నుంచి గ్రౌండ్ వరకు ప్రతిభకు గుర్తింపు..
ఆంధ్ర యువతకు కొత్త ఆశలు నింపుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్-2026
క్రికెట్ అంటే భారతదేశంలో క్రేజ్. యువతకు కేవలం ఇది ఆట కాదు… అది ఒక కల, ఒక లక్ష్యం, ఒక భవిష్యత్తు. చిన్న గ్రామంలో టెన్నిస్ బాల్‌తో ప్రారంభమైన ప్రయాణం ఒకరోజు జాతీయ జట్టులోకి తీసుకెళ్లాలనే ఆశ ప్రతి యువ ఆటగాడిలో ఉంటుంది. అలాంటి కలలకు రెక్కలు తొడిగే వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)-2026 సిద్ధమవుతోంది.
క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 9 నుంచి 30 వరకు విశాఖపట్నం, కడప, మంగళగిరి నగరాల్లో జరగనున్న ఈ టోర్నీ కేవలం క్రికెట్ పోటీల సమాహారం మాత్రమే కాదు. రాష్ట్రంలోని వేలాది మంది యువ క్రీడాకారులు సత్తా నిరూపించుకునే అవకాశాల వేదిక ఇది.
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రికెట్‌పై ఆసక్తి అధికమవుతోంది. సరైన వేదిక, అవకాశాలు లభిస్తే తాము కూడా ఉన్నత స్థాయికి చేరుకోగలమనే నమ్మకం యువతలో పెరుగుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఏపీఎల్ వంటి టోర్నీలు ప్రతిభను వెలికితీయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
గతంలో స్థానిక స్థాయిలో మెరిసిన పలువురు ఆటగాళ్లు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో గుర్తింపు పొందిన ఉదాహరణలు ఉన్నాయి. గుంటూరుకు చెందిన యువ క్రికెటర్ రషీద్ ఇండియా-ఏ జట్టులో చోటు దక్కించుకోవడం కూడా అలాంటి అవకాశాల ఫలితమే. దీంతో రాష్ట్రంలోని యువ ఆటగాళ్లలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది.
ఏపీఎల్ ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం నగరాలకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభ చూపే అవకాశం కల్పిస్తోంది. గ్రామాల్లోని మైదానాల నుంచి వచ్చిన ఆటగాళ్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం పొందుతున్నారు. ఒక మంచి ప్రదర్శన వారి జీవిత గమనాన్ని మార్చగలదనే ఆశ వారికి ప్రేరణగా నిలుస్తోంది.
విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెంచేందుకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించడం మరో విశేషం. ప్రత్యక్షంగా మ్యాచ్‌లు వీక్షించడంతో యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, జట్టు భావన వంటి విలువలు పెంపొందుతాయి.
ఇక ఈ టోర్నీ ద్వారా క్రికెట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి కూడా ప్రపంచానికి పరిచయం కానుంది. జానపద కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. క్రీడలు, సంస్కృతిని ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ఈ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
నేటి యువతకు విజయానికి ఎన్నో మార్గాలు ఉన్నా, క్రీడలు అందులో గౌరవప్రదమైన మార్గం. ప్రతిభ, పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యువకుడూ దేశం గర్వించే క్రీడాకారుడిగా ఎదగగలడు. ఆ అవకాశాలకు అవకాశమిచ్చే టోర్నీగానే ఏపీఎల్-2026ను చూడాలి.
మూడు నగరాలు… ఏడు జట్లు… వేలాది మంది అభిమానులు… కానీ వీటన్నింటికంటే ముఖ్యమైనది వేలాది మంది యువత కలలు. వాటికే దారి చూపే వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మరోసారి రాష్ట్ర క్రీడా చరిత్రలో తన ప్రత్యేక ముద్ర వేయబోతోంది.
