ఏటా వేసవిలో మామిడి పండును ప్రతీ తెలుగు గడప రుచి చూడాల్సిందే. మామిడిలో ఎన్నో రకాలు ఉన్నాయి. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మామిడి రకాలలో లంగ్రా మామిడి ఒకటి. దీనికి ప్రత్యేకమైన రుచి, అద్భుతమైన సువాసన, మెత్తటి రసపుష్టి ఉన్న గుజ్జు ఉంటుంది. ఈ మామిడికి దేశంలో ఎంతో మంది ఫాన్స్ కూడా ఉన్నారు.
ఈ మామిడి పండు గురించి కానీ దాని పేరు గురించి చాలా మందికి తెలీదు. “లంగ్రా” మామిడి పండన్న మాట. లంగడా అని వాడుక భాషలో పిలుస్తారు. ఈ పదానికి అర్ధం “కుంటి” లేదా “కాలు సరిగా లేని వ్యక్తి” అని అర్థం. మామిడికి ఇలాంటి పేరు ఎందుకు వచ్చిందనే సందేహం చాలా మందికి వస్తుంది.
వ్యవసాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లంగ్రా మామిడి ఉత్తర భారతదేశంలోని సారవంతమైన నేలల్లో మొదట సాగు చేశారు . ఎన్నో తరాలుగా అక్కడి రైతులు ఈ మామిడి తోటలను పెంచుతున్నారు. కాలక్రమేణా ఈ మామిడి తన ప్రత్యేకమైన రుచితో ప్రజాదరణ పొందింది. ఈ పండు రుచి చూస్తే తీపితో పాటు చిరు పులుపుగా ఉంటుంది . ఇందులో పీచు కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల తినడానికి మరింత రుచిగా ఉంటుంది.
లంగ్రా మామిడికి మరో ప్రత్యేకత ఉంది. సాధారణంగా చాలా మామిడిపండ్లు పండిన తర్వాత పసుపు లేదా నారింజ రంగులోకి మారతాయి. కానీ లంగ్రా మామిడి పూర్తిగా పండిన తర్వాత కూడా పచ్చని రంగులోనే పసుపు రంగు అనేది కనిపించదు . ఈ లక్షణం వల్ల ఇతర మామిడి రకాలతో పోలిస్తే దీనిని సులభంగా లంగ్రా మామిడి అని గుర్తుపట్టొచ్చు.
ఇక ఈ పేరుకు సంబంధించి ఇంటరెస్టింగ్ గా ఉండే జానపద కథ కూడా ఉంది. ఈ మామిడి రకానికి మూలమైన చెట్టును ఒక అవిటి వ్యక్తి నాటాడట. ఆ వ్యక్తి కాలులో లోపం ఉండటంతో గ్రామస్థులు ఆ చెట్టు నుంచి వచ్చిన పండ్లను “లంగ్రా మామిడి” అని పిలవడం ప్రారంభించారట. అంటే “కుంటివాడి మామిడి పండు ” అనే అర్థం. ఆ పేరు క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరించి బాగా పాపులర్ కావడంతో ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తున్నారు.
వ్యవసాయ సమాజాల్లో పంటలకు, పండ్లకు వాటి మూలాలు, ప్రాంతాలు లేదా వ్యక్తులతో సంబంధం ఉన్న పేర్లు పెట్టడం చాలా సాధారణ విషయం. లంగ్రా మామిడి పేరు కూడా అలాంటి సంప్రదాయంలో భాగమే.
అందుకే “లంగ్రా” అనే పేరు మొదట విచిత్రంగా అనిపించినా, అది ఒక చరిత్రను, ఒక కథను మనకు గుర్తుచేస్తుంది. ఒక సాధారణ పేరు కూడా తరతరాల చరిత్రను ఎలా సజీవంగా ఉంచిందో ఈ పండే ఉదాహరణ.
