ఘనంగా రఘుపతి వెంకటరత్నం 87వ వర్ధంతి

IMG 20260526 WA0220(1)

కాకినాడ: విద్యావేత్త, ప్రముఖ సంఘసంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు 87వ వర్ధంతి సందర్భంగా ఆర్విఎన్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.

మంగళవారం జిల్లా క్రీడా మైదానం వద్ద గల రఘుపతి వెంకటరత్నం నాయుడు విగ్రహం వద్ద ఆర్విఎన్ స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్ గోవిందరాజులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా మాజీ ఎంపీపీ వాసిరెడ్డి ఏసుదాసు, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవి చక్రవర్తి అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత అయితాబత్తుల రామేశ్వరరావు, యుటిఎఫ్ పూర్వ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి ప్రభాకర్ వర్మ, కె సత్తిరాజులు వెంకటరత్నం నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మచిలీపట్నంలో జన్మించిన వెంకటరత్నం నాయుడు కాకినాడ పిఆర్ కళాశాల ప్రిన్సిపల్గా తొలిసారి మహిళలకు ప్రవేశం కల్పించి చరిత్ర సృష్టించారని తెలిపారు. ఆంధ్రలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించారని, దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని కొనియాడారు. అనాధ పిల్లలను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించిన మహనీయుడన్నారు. మద్రాస్ యూనివర్సిటీ తొలి తెలుగు వైస్ ఛాన్సలర్గా పనిచేశారని తెలిపారు. రఘుపతి వెంకటరత్నం నాయుడు స్ఫూర్తిని నేటి తరంలో కొనసాగించడానికి ఆర్విఎన్ స్టడీ సర్కిల్ కృషి చేయడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో బసవ ప్రభాకర్ రావు, రంగనాయకులు, చిట్టిబాబు, ప్రసాద్, యుటిఎఫ్ నాయకులు సిహెచ్వి రమణ, ఆర్ జయ ప్రకాష్. సిహెచ్ ఆశీర్వాదం, రిటైర్డ్ టీచర్స్ జోగా అప్పారావు అర్జునరావు, సిఐటియు నాయకులు మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.