కాకినాడ: కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరములు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రతిబింబిస్తూ రూపొందించిన పేపర్ క్రాఫ్టు కళాకృతుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు రంగురంగుల కాగితాలతో పుష్పాలు, జంతువులు, పక్షులు, అలంకరణ వస్తువులు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నమూనాలు, వివిధ ఆకృతుల క్రాఫ్టు వస్తువులను ఎంతో చక్కగా తయారు చేసి ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు.
ఈ ప్రదర్శనను సందర్శించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సందర్శకులు విద్యార్థుల ప్రతిభను అభినందించారు. చిన్నారులలో దాగి ఉన్న కళాత్మక నైపుణ్యాలను వెలికితీయడంలో ఇటువంటి శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన కళాకృతులను వివరిస్తూ తమ ఆలోచనలను పంచుకోవడం అందరినీ ఆకట్టుకుంది.
జిల్లా కేంద్ర గ్రంథాలయ ఉప గ్రంథాలయాధికారి ఇన్ చార్జి కె.కిషోర్, మాట్లాడుతూ వేసవి విజ్ఞాన శిబిరాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, చేతిపనులపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలియజేసి, భవిష్యత్తులో కూడా ఇలాంటి సృజనాత్మక కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ శిక్షణా నిపుణులు,ఎం. సత్య బాల, ఉపాధ్యాయులు టి. సునీత,జిల్లా గ్రంథాలయ సంస్థ సీనియర్ అసిస్టెంట్ ఎం.శ్రావ్య, గ్రంథాలయ సిబ్బంది ఎవిఎస్. నాగేంద్ర కుమార్,టి.వీర్రాజు,ఎన్ విఎస్ ఫణీంద్ర కుమార్.జి. దుర్గా ప్రసాద్, వి. అరుణ, కార్యాలయ సిబ్బంది ఎస్.రాజు, టి.సాయి వెంకట్రావు, స్థానిక పాఠశాలల విద్యార్థిని,విద్యార్థులు 78 మంది పాల్గొనడం జరిగినది.
