జూలైలో కార్ల అమ్మకాలకు జోష్

Cars

దేశంలో కార్ల అమ్మకాలు జూలైలో భారీగా పెరిగాయి. ఈ ఏడాది జూలైలో సుమారు 4.65 లక్షల నుంచి 4.70 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడైనట్లు అంచనా. గత ఏడాది జూలైలో సుమారు 3.5 లక్షల వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే ఈసారి అమ్మకాలు దాదాపు 33 శాతం పెరిగాయి. కార్ల అమ్మకాలు పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని మారుతీ సుజుకీ తెలిపింది. వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడం, ఆదాయపు పన్ను రాయితీలు, జీఎస్టీ 2.0 అమలు ప్రజలకు ఊరటనిచ్చాయి. దీంతో కార్లు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగింది.

మారుతీ అమ్మకాలు 43 శాతం పెరుగుదల

దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ జూలైలో రికార్డు స్థాయిలో 1,96,203 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 1,37,776 వాహనాలు అమ్ముడయ్యాయి. దీంతో అమ్మకాలు 43.4 శాతం పెరిగాయి. చిన్న కార్ల నుంచి ఎస్‌యూవీల వరకు అన్ని రకాల వాహనాలకు డిమాండ్ పెరిగింది. సీఎన్‌జీ కార్లకు కూడా మంచి ఆదరణ లభించింది.

ఇతర కంపెనీలకూ పెరిగిన డిమాండ్

హ్యుందాయ్ జూలైలో అత్యధికంగా 54,210 వాహనాలను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 23.3 శాతం పెరిగింది . టాటా మోటార్స్ అమ్మకాలు 58 శాతం పెరిగి 62,611 వాహనాలకు చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా 60,048 వాహనాలను విక్రయించింది. అమ్మకాలు 20 శాతం పెరిగాయి. ఇతర కంపెనీల్లోనూ అమ్మకాలు పెరిగాయి. హోండా 6,014, టయోటా 30,516, కియా 28,200, ఎంజీ మోటార్ 8,158 వాహనాలను విక్రయించాయి. నిస్సాన్ అమ్మకాలు కూడా గత ఏడాది 1,420 నుంచి ఈసారి 4,518 వాహనాలకు పెరిగాయి.

పండుగ సీజన్‌పై ఆశలు

కార్ల అమ్మకాలు పెరగడం ఆటో రంగంలో డిమాండ్ బలపడుతోందని సూచిస్తోంది. తక్కువ వడ్డీ రేట్లు, పన్ను రాయితీలు, ప్రజల చేతిలో పెరిగిన ఆదాయం కార్ల కొనుగోళ్లకు సహాయపడుతున్నాయి. ముందున్న పండుగ సీజన్‌లో కూడా ఇదే జోరు కొనసాగుతుందా అనే దానిపై ఆటో కంపెనీలు దృష్టి పెట్టాయి. సాధారణంగా పండుగల సమయంలో దేశంలో కార్ల కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ఈసారి కూడా అమ్మకాలు  పెరిగే అవకాశం ఉందని కంపెనీలు ఆశిస్తున్నాయి.