– శాస్త్రవేత్తల కీలక అధ్యయనం
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఓ ఇంటి పైకప్పును చీల్చుకుంటూ పడిన ఉల్క లో భూమిపై సహజంగా కనిపించని వందలాది అమైనో ఆమ్లాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. విశ్వంలో జీవం ఆవిర్భావానికి అవసరమైన రసాయన పదార్థాలు గ్రహశకలాల ద్వారానే భూమికి చేరాయా? అనే ప్రశ్నకు కొత్త దిశను చూపిస్తోంది. 2024 జూలై 16న ఈ ఉల్క భూమి వాతావరణంలోకి గంటకు దాదాపు 51,500 కిలోమీటర్ల (సుమారు 32,000 మైళ్లు) వేగంతో ప్రవేశించింది. న్యూయార్క్ నగరంపై దూసుకెళ్తూ భారీ శబ్దం (Sonic Boom) సృష్టించింది. అనంతరం సుమారు 2 పౌండ్ల బరువున్న ఉల్క శకలం న్యూజెర్సీలోని హిల్స్‌బరో (Hillsborough) ప్రాంతంలోని ఒక ఇంటి పైకప్పును చీల్చుకుని లోపల పడింది.
ఇంటి యజమాని అప్రమత్తత
ఆ సమయంలో ఇంట్లో ఉన్న యజమాని పెద్ద శబ్దం విని పడకగదికి వెళ్లగా, పైకప్పులో రంధ్రం కనిపించింది. గదిలో గంధకం వంటి ఘాటైన వాసన వ్యాపించి ఉండటంతో పాటు మంచం, కార్పెట్, గది అంతా నల్లటి దుమ్ము, ఉల్క ముక్కలు చెల్లాచెదురుగా కనిపించాయి. కాలుష్యం సోకకుండా ఉండేందుకు ఆయన ఉల్క ముక్కలను డిస్పోజబుల్ గ్లౌజులు ధరించి సేకరించి, అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి గాజు సీసాల్లో భద్రపరిచారు. ఈ అప్రమత్తత వల్ల ఉల్క నమూనా దాదాపు అసలు స్వరూపంలోనే శాస్త్రవేత్తలకు లభించింది.
ఉల్క మూలాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు
పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ, డోర్‌బెల్ కెమెరాల్లో నమోదైన వీడియోలను విశ్లేషించి శాస్త్రవేత్తలు ఉల్క ప్రయాణ మార్గాన్ని పునర్నిర్మించారు. వారి విశ్లేషణ ప్రకారం ఈ ఉల్క అంగారకుడు , గురుడు గ్రహాల మధ్య ఉన్న గ్రహశకలాల మండలం నుంచి వచ్చినట్లు నిర్ధారించారు.
4.5 బిలియన్ సంవత్సరాల నాటి అరుదైన ఉల్క
పరిశోధనలో ఇది సీఎం-రకానికి చెందిన కార్బనేసియస్ కాండ్రైట్ (CM-type Carbonaceous Chondrite) అనే అరుదైన ఉల్క అని తేలింది. ఈ తరహా ఉల్కలు సౌర కుటుంబం ఏర్పడిన తొలి దశల్లో, అంటే సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. వీటిలో కార్బన్, నీటిని కలిగిన ఖనిజాలు , సేంద్రీయ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ప్రారంభ సౌరవ్యవస్థ పరిస్థితులను తెలుసుకోవడానికి ఇవి అమూల్యమైన ఆధారాలుగా భావిస్తారు.
కొత్త రసాయన ఆధారాలు
సేటి ఇన్స్టిట్యూట్, నాసా ఏమ్స్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన విశ్లేషణలో ఈ ఉల్కలో ఉప్పు ద్రావణాల ప్రభావానికి గురైన పురాతన గ్రహశకలం ఉపరితల భాగాల అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ తరహా రసాయన మార్పులు ఈ రకం గ్రహశకలాల్లో ఇప్పటివరకు గుర్తించలేదని వారు తెలిపారు. పరిశోధనకు నాయకత్వం వహించిన ఖగోళ శాస్త్రవేత్త పీటర్ జెన్నిస్కెన్స్ ప్రకారం, ఇంటి యజమాని తీసుకున్న జాగ్రత్తల వల్ల ఇప్పటివరకు లభించిన స్వచ్ఛమైన CM1/2 ఉల్క నమూనాల్లో ఇది ఒకటిగా నిలిచింది.
భూమిపై లేని అమైనో ఆమ్లాలు
పరిశోధకులు ఈ ఉల్కలో సేంద్రీయ కార్బన్‌తో పాటు వందలాది రకాల అమైనో ఆమ్లాలను గుర్తించారు. అమైనో ఆమ్లాలు ప్రోటీన్ల నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక రసాయన అణువులు. సహ పరిశోధకుడు డాక్టర్ డానీ గ్లావిన్ ప్రకారం, గుర్తించిన అమైనో ఆమ్లాల్లో ఎక్కువ భాగం భూమిపై జీవుల్లో కనిపించని లేదా అత్యంత అరుదుగా కనిపించే రకాలు. అందువల్ల అవి నిజంగా గ్రహాంతర మూలం కలిగినవేనని ఆయన తెలిపారు.
జీవం ఆవిర్భావంపై కొత్త ఆశలు
ఈ పరిశోధన ద్వారా శాస్త్రవేత్తలు రెండు కీలక ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. ప్రారంభ దశలో గ్రహశకలాలు ఎలా పరిణామం చెందాయి? భూమిపై జీవం పుట్టడానికి అవసరమైన రసాయన పదార్థాలను గ్రహశకలాలే తీసుకొచ్చాయా? ఈ ఉల్క అధ్యయనం భవిష్యత్తులో జీవం ఆవిర్భావ రహస్యాలను ఛేదించడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
