టైటాన్‌పై మీథేన్ సముద్రాలు..

Titan

– కొత్త పరిశోధనలో ఆసక్తికర విషయాలు

సూర్యుడికి సుమారు 140 కోట్ల కిలోమీటర్ల దూరంలో, అంగారక (మార్స్), గురు (జూపిటర్) గ్రహాల అవతల ఉన్న శని గ్రహం (Saturn) అతిపెద్ద ఉపగ్రహం టైటాన్ (Titan) భూమిలానే ఉంది . అక్కడ వర్షాలు కురుస్తాయి. నదులు ప్రవహిస్తాయి. సరస్సులు 100 మీటర్లకుపైగా లోతుగా ఉంటాయి. అయితే ఒక పెద్ద తేడా ఉంది. భూమిపై నీటితో వాతావరణం ఉంటే టైటాన్‌పై ద్రవరూప మీథేన్ (Methane), ఈథేన్ (Ethane) ఆధారంగా వాతావరణ చక్రం కొనసాగుతుంది.అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన తాజా పరిశోధన నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఇందులో నాసా కాస్సిని అంతరిక్ష నౌక సేకరించిన రాడార్ డేటాను విశ్లేషించి, టైటాన్ సముద్రాల నిర్మాణంపై కొత్త విషయాలను వెల్లడించారు.

మూడు సముద్రాల్లో ద్రవం ఒకేలా లేదు

పరిశోధకులు టైటాన్ ఉత్తర ధ్రువ ప్రాంతంలోని మూడు ప్రధాన సముద్రాలు క్రాకెన్ మారే , లిగేయా మారే , పుంగా మారేలను అధ్యయనం చేశారు. ఇవి ఒకే రకమైన ద్రవంతో నిండి లేవని తేలింది. సముద్ర తీర ప్రాంతాల్లోకి ప్రవహించే నదుల కారణంగా అక్కడ మీథేన్ శాతం ఎక్కువగా ఉండగా, సముద్ర మధ్యభాగాల్లో ఈథేన్ శాతం కొద్దిగా అధికంగా ఉందని గుర్తించారు.

టైటాన్ ఎందుకు ప్రత్యేకం?

టైటాన్‌పై ఉష్ణోగ్రత మైనస్ 290 డిగ్రీల ఫారెన్‌హీట్ (సుమారు -179°C) వరకు పడిపోతుంది. ఇంత తీవ్రమైన చలిలో భూమిపై వాయువులుగా ఉండే మీథేన్, ఈథేన్ అక్కడ ద్రవరూపంలో ఉంటాయి. దీంతో అక్కడ కూడా భూమిలాగే ఒక వాతావరణ చక్రం కొనసాగుతుంది. మీథేన్ ఆవిరై మేఘాలుగా మారి వర్షంగా కురుస్తుంది. నదులు, సరస్సులు, సముద్రాల్లో చేరుతుంది. నాసా ప్రకారం, భూమి తర్వాత ఉపరితలంపై స్థిరమైన ద్రవరూప సరస్సులు, సముద్రాలు ఉన్న ఏకైక ప్రపంచం టైటాన్ మాత్రమే.

100 మీటర్లకుపైగా లోతైన సరస్సులు

2017లో కాస్సిని అంతరిక్ష నౌక టైటాన్‌కు అత్యంత సమీపంగా వెళ్లినప్పుడు అక్కడి ఉత్తర సరస్సులు 100 మీటర్లకుపైగా లోతు ఉన్నట్లు నిర్ధారించింది. ఈ సరస్సులకు మీథేన్ వర్షాలే ప్రధాన నీటి వనరు. అదనంగా, ద్రవం భూగర్భ మార్గాల ద్వారా నెమ్మదిగా ప్రవహిస్తోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

కాస్సిని డేటాలో కొత్త విశ్లేషణ

ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు ఇప్పటివరకు పూర్తిగా ఉపయోగించని బైస్టాటిక్ రాడార్ డేటాను తిరిగి విశ్లేషించారు. ఈ విధానంలో కాస్సిని పంపిన రేడియో తరంగాలు టైటాన్ ఉపరితలం నుంచి ప్రతిఫలించి భూమిపై ఉన్న భారీ యాంటెనాలకు చేరాయి. దీంతో రెండు విషయాలను విడివిడిగా తెలుసుకునే అవకాశం లభించింది. సముద్ర ఉపరితలం ఎంత అలలతో ఉందో.
ద్రవంలో ఏ పదార్థాలు ఎంత శాతంలో ఉన్నాయో. నదుల సంగమ ప్రాంతాల్లో ప్రత్యేక మార్పులు నదులు సముద్రాల్లో కలిసే ప్రాంతాల్లో రాడార్ ప్రతిఫలనాలు భిన్నంగా కనిపించాయి. దీనికి కారణం, నదుల ద్వారా వచ్చే మీథేన్ అధికంగా ఉండే ద్రవం సముద్రాల్లోని ఈథేన్‌ను పలుచబరచడమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది భూమిపై మంచినీటి నదులు సముద్రంలో కలిసినప్పుడు ఏర్పడే ఉప్పు-తీపి నీటి మిశ్రమ ప్రాంతాలను పోలి ఉంటుంది. అలాగే నదుల ముఖద్వారాలు, సముద్రాలను కలిపే సన్నని కాలువల వద్ద స్వల్ప ఉపరితల మార్పులు కనిపించాయి.

భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలకు టైటాన్ ఎందుకు కీలకం?

టైటాన్ కేవలం ఒక ఆసక్తికర ఉపగ్రహం మాత్రమే కాదు. జీవం ఏర్పడటానికి అవసరమైన సంక్లిష్ట రసాయన చర్యలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశంగా కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే నాసా డ్రాగన్‌ఫ్లై అనే ప్రత్యేక మిషన్‌ను సిద్ధం చేస్తోంది. ఇది అణుశక్తితో పనిచేసే డ్రోన్ తరహా హెలికాప్టర్. ఇది టైటాన్‌పై దిగిపోయి అక్కడి నేల, వాతావరణం, రసాయనాలను ప్రత్యక్షంగా పరిశీలించనుంది. కాస్సిని మిషన్ ముగిసినా పరిశోధన కొనసాగుతోంది. కాస్సిని అంతరిక్ష నౌక 2017లో తన మిషన్‌ను ముగించింది. అనంతరం దానిని ఉద్దేశపూర్వకంగా శని గ్రహ వాతావరణంలోకి పంపి ధ్వంసం చేశారు.అయితే అది పంపించిన డేటా ఇప్పటికీ కొత్త శాస్త్రీయ ఆవిష్కరణలకు దారి తీస్తూనే ఉంది. ఈ తాజా అధ్యయనం కూడా కాస్సిని సేకరించిన పాత సమాచారాన్నే ఆధారంగా చేసుకుని టైటాన్ సముద్రాలపై కొత్త అవగాహనను అందించింది.