190 ఏళ్ల నాటి పాంగోలిన్ నమూనాతో కొత్త జాతి గుర్తింపు

Pongolin

లండన్‌లోని ఒక మ్యూజియంలో  190 సంవత్సరాలుగా భద్రపరిచిన పాంగోలిన్ నమూనా ఆధారంగా శాస్త్రవేత్తలు నేపాల్, ఉత్తర భారతదేశంలో నివసించే పాంగోలిన్ ఒక ప్రత్యేక జాతి అని నిర్ధారించారు. 1836లో సేకరించిన ఆ చారిత్రక నమూనా నుంచి డీఎన్‌ఏను వెలికితీసి, హిమాలయ పాంగోలిన్ చైనీస్ పాంగోలిన్‌కు ఉపజాతా? లేక ప్రత్యేక జాతా? అనే  ప్రశ్నలపై  ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న వివాదానికి తెరదించారు.

కమ్యూనికేషన్స్ బయాలజీ  జర్నల్‌లో పబ్లిష్ ఐన ఈ పరిశోధన ప్రకారం, ఈ జీవిని  మనీశ్ అరిటా అనే పేరుతోనే అధికారికంగా గుర్తించాలని పేర్కొన్నారు . దాదాపు రెండు శతాబ్దాల క్రితం దీనికి పెట్టిన ఈ పేరునే ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించారు. ప్రపంచంలో అత్యధికంగా అక్రమ రవాణాకు గురవుతున్న క్షీరదాల్లో పాంగోలిన్ మొదటి స్థానంలో ఉండటంతో, ఈ గుర్తింపు భవిష్యత్తులో సంరక్షణ చర్యలు, వేట నిరోధక చర్యలకు ఎంతో ఉపయోగపడనుంది.

1836లో సేకరించిన నమూనాతో కీలక ఆధారాలు

1836లో ఈ కీలక నమూనాను ప్రకృతి శాస్త్రవేత్త బ్రియన్ హౌటన్ హాడ్జ్‌సన్ నేపాల్‌లో సేకరించారు. తర్వాత అది లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో భద్రపరిచారు.  పరిశోధకులు ఈ చారిత్రక నమూనా నుంచి డీఎన్‌ఏను సేకరించి, నేపాల్ , ఉత్తర భారతదేశంలోని జీవించిన పాంగోలిన్‌ల డీఎన్‌ఏతో పోల్చారు. రెండింటి జన్యు సమాచారం సరిపోవడంతో, ప్రస్తుతం హిమాలయ ప్రాంతంలో కనిపించే పాంగోలిన్‌లు హాడ్జ్‌సన్ వర్ణించిన అదే జాతికి చెందినవని తేలింది.

‘మనీశ్ ఇండోబుర్మానిక ‘ పేరు ఎందుకు రద్దు చేశారు ? 

2025లో స్వాధీనం చేసుకున్న పాంగోలిన్ పొలుసులపై చేసిన పరిశోధన ఆధారంగా మనీశ్ ఇండోబుర్మానిక అనే కొత్త జాతి పేరును ప్రతిపాదించారు. అయితే శాస్త్రీయ నామకరణ నియమాల ప్రకారం ముందుగా ప్రచారంలో ఉన్న  పేరు ప్రచురితమైతే అదే కొనసాగుతుంది. ఈ తాజా పరిశోధనలో చారిత్రక నమూనా మనీశ్ ఆరిటాకే చెందినదని నిర్ధారణ కావడంతో, మనీశ్ ఇండోబుర్మానిక అనే పేరు ఇకపై చెల్లుబాటు కాదు. దాన్ని “జూనియర్ సినోనిమ్”గా పరిగణిస్తారు.

డీఎన్‌ఏతో పాటు శరీర నిర్మాణాన్నీ పరిశీలించారు

ఈ అధ్యయనానికి సహనేతృత్వం వహించిన అమెరికాలోని ఫీల్డ్ మ్యూజియం  , చికాగో శాస్త్రవేత్తలు కేవలం డీఎన్‌ఏపైనే ఆధారపడలేదు. ప్రపంచంలోని వివిధ మ్యూజియాల్లో భద్రపరిచిన 44 పుర్రెలు, 26 చర్మ నమూనాలను పరిశీలించారు. వీటిలో శరీర పరిమాణం, చెవుల ఆకారం, తోక పొడవు, పొలుసుల అమరిక వంటి లక్షణాలను హిమాలయ పాంగోలిన్, చైనీస్ పాంగోలిన్‌ల మధ్య పోల్చారు.

హిమాలయ పాంగోలిన్ ప్రత్యేక లక్షణాలు

పరిశోధనలో కొన్ని స్పష్టమైన తేడాలు బయటపడ్డాయి. హిమాలయ పాంగోలిన్ శరీరం కొద్దిగా పెద్దగా ఉంటుంది. దీని తోక చైనీస్ పాంగోలిన్ కంటే పొడవుగా ఉంటుంది. చెవులు చిన్నవిగా ఉంటాయి.ఆరిటా అనే పేరు కూడా ఈ చెవుల ప్రత్యేక ఆకృతినే సూచిస్తుంది. జన్యు విశ్లేషణ ప్రకారం ఈ రెండు జాతులు సుమారు 18 లక్షల సంవత్సరాల క్రితం విడిపోయాయి. అప్పటి నుంచి ఇవి దాదాపు  వేర్వేరుగా అభివృద్ధి చెందాయి. వాటి మధ్య పరస్పర సంయోగం చాలా తక్కువగా మాత్రమే జరిగినట్లు తేలింది.

సంరక్షణకు ఎందుకు కీలకం?

పాంగోలిన్‌లను  వాటి పొలుసుల కోసం భారీ స్థాయిలో వేటాడుతున్నారు. ఈ పొలుసులను కొన్ని సంప్రదాయ వైద్య విధానాల్లో ఉపయోగిస్తారు. అయితే అవి మనుషుల గోళ్లు, వెంట్రుకల్లో ఉండే కెరాటిన్ అనే పదార్థంతోనే తయారవుతాయి. అక్రమ రవాణా కేసుల్లో సాధారణంగా ఈ జీవులు  కాకుండా కేవలం వాటి పొలుసులే పట్టుబడుతూ ఉంటాయి . అందువల్ల అవి ఏ జాతికి చెందినవో గుర్తించడం అధికారులకు కష్టంగా ఉండేది.

అక్రమ వేటను గుర్తించడం సులభం

హిమాలయ పాంగోలిన్, చైనీస్ పాంగోలిన్‌లు నివసించే ప్రాంతాలను స్పష్టంగా గుర్తించవచ్చు. దీనివల్ల  రక్షించిన పాంగోలిన్‌లను సరైన ప్రాంతాల్లోనే తిరిగి వదిలే అవకాశం ఉంటుంది. స్వాధీనం చేసుకున్న పొలుసులు ఏ ప్రాంతానికి చెందినవో గుర్తించడం సులభమవుతుంది. ఏ ప్రాంతాల్లో అక్రమ వేట ఎక్కువగా జరుగుతోందో గుర్తించి అక్కడే ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు.

ఇక ఈ పరిశోధన మరో విషయాన్ని కూడా స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహజ చరిత్ర మ్యూజియాల్లో శతాబ్దాల క్రితం సేకరించిన అనేక జంతు నమూనాలు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. అప్పట్లో సేకరించిన ఈ నమూనాలు నేటి అత్యాధునిక డీఎన్‌ఏ సాంకేతికతతో కొత్త శాస్త్రీయ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాయి. అడవుల్లో పాంగోలిన్‌లను ప్రత్యక్షంగా అధ్యయనం చేయడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో మ్యూజియాల్లోని చారిత్రక నమూనాలు వాటి పరిణామ క్రమం, జాతుల గుర్తింపు, సంరక్షణ వ్యూహాలను రూపొందించడంలో అమూల్యమైన పాత్ర పోషిస్తున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. మనీశ్ ఆరిటాను ప్రత్యేక జాతిగా అధికారికంగా గుర్తించడం ద్వారా, శతాబ్దాల క్రితం సేకరించిన శాస్త్రీయ నమూనాలు నేటికీ జీవ వైవిధ్య పరిరక్షణలో ఎంత కీలకమో మరోసారి నిరూపితమైంది.