ఆసియాలోనే ఎత్తైన చెట్టు

Tree

– 84 మీటర్ల తైవానియా ఫిర్

తైవాన్‌లోని దట్టమైన కొండ అడవుల్లో శాస్త్రవేత్తలు తూర్పు ఆసియాలోనే అత్యంత ఎత్తైన చెట్టును గుర్తించారు. ఇది తైవానియా ఫిర్ జాతికి చెందిన భారీ చెట్టు. దీని ఎత్తు ఏకంగా 84.1 మీటర్లు (276 అడుగులు). దాదాపు పదేళ్లుగా సాగుతున్న పరిశోధనలో ఈ చెట్టును గుర్తించారు. శాస్త్రవేత్తలు, చెట్లు ఎక్కే నిపుణులు, రిమోట్ సెన్సింగ్ నిపుణులతో పాటు వందలాది మంది ప్రజలు కూడా ఈ పరిశోధనలో భాగమయ్యారు.

పదేళ్ల అన్వేషణ

2014లో ‘తైవాన్ ట్రీ సీకర్స్ అనే పరిశోధకుల బృందం తైవాన్‌లోని అతిపెద్ద చెట్లను గుర్తించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ బృందంలో పర్యావరణ శాస్త్రవేత్తలు, చెట్లు ఎక్కే నిపుణులు, భూగర్భ శాస్త్రవేత్తలు, ఆధునిక సాంకేతిక నిపుణులు ఉన్నారు. 2023లో వారి ప్రయత్నాలు ఫలించాయి. 84.1 మీటర్ల ఎత్తున్న తైవానియా ఫిర్ చెట్టును వారు గుర్తించారు. దీంతో ఇది తైవాన్‌లోనే కాకుండా మొత్తం తూర్పు ఆసియాలో నమోదైన అత్యంత ఎత్తైన చెట్టుగా నిలిచింది. స్థానిక రుకై తెగ ప్రజలు ఇలాంటి భారీ చెట్లను ‘చంద్రుడిని తాకే చెట్లు’ అని అందంగా పిలుస్తారు.

కొండలే అడవులను కాపాడాయి

తైవాన్ విస్తీర్ణం స్విట్జర్లాండ్‌తో పోలిస్తే దాదాపు సమానంగా ఉంటుంది. అయితే అక్కడ ఎక్కువ ప్రాంతం ఎత్తైన కొండలతో నిండి ఉంటుంది. 3,000 మీటర్లకంటే ఎక్కువ ఎత్తున్న వందలాది పర్వత శిఖరాలు ఉన్నాయి. ఈ భౌగోళిక పరిస్థితుల వల్ల తైవాన్‌లో ఉష్ణమండల అడవుల నుంచి మంచు కొండల వరకు అనేక రకాల పర్యావరణ వ్యవస్థలు ఉన్నాయి. తైవాన్‌లో దాదాపు 5,000 రకాల మొక్కలుఉన్నాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దేశంలో సుమారు 60 శాతం భూభాగం అడవులతోనే కప్పబడి ఉంది. కొండ ప్రాంతాలు చాలా కఠినంగా ఉండటంతో గతంలో పారిశ్రామికంగా చెట్లను నరికే కార్యకలాపాలు అక్కడి కొన్ని పురాతన అడవులకు చేరుకోలేకపోయాయి. అందుకే ఇప్పటికీ కొన్ని ప్రాచీన అడవులు అక్కడ మిగిలి ఉన్నాయి.

చెట్లను గుర్తించడంలో కొత్త టెక్నాలజీ

వందల కోట్ల చెట్ల మధ్య అత్యంత ఎత్తైన చెట్లను గుర్తించడం అంత సులభం కాదు. దట్టమైన అడవుల్లో సాధారణంగా చెట్ల ఎత్తును సరిగ్గా కొలవడం కష్టం. అందుకే పరిశోధకులు లిడార్ అనే ఆధునిక సాంకేతికతను ఉపయోగించారు.
లిడార్ లో గాల్లో నుంచి లేజర్ కిరణాలను పంపించి అడవులకు సంబంధించిన త్రీడీ మ్యాప్‌లను తయారు చేస్తారు. దీంతో ఎత్తైన చెట్లను గుర్తించడం సులభమైంది. అయితే కొండ ప్రాంతాల్లో ఈ సాంకేతికత కూడా పూర్తిగా కచ్చితంగా పనిచేయలేదు. కొండలు, లోయలు, చెట్ల ఆకారాల కారణంగా కంప్యూటర్లు చాలా చెట్లను తప్పుగా గుర్తించాయి. అందుకే పరిశోధకులు ప్రజల సహాయం తీసుకున్నారు. 2020 నుంచి వందలాది మంది వాలంటీర్లు LiDAR ద్వారా వచ్చిన చిత్రాలను పరిశీలించి నిజమైన భారీ చెట్లను గుర్తించడంలో సహకరించారు. ఆటోమేటిక్ సిస్టమ్ గుర్తించిన భారీ చెట్లలో సుమారు 93 శాతం తప్పుగా గుర్తించినవేనని** పరిశోధకులు గుర్తించారు. 2022 చివరి నాటికి ఈ సహకారంతో 65 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న 941 చెట్లను గుర్తించారు.

20 కిలోమీటర్ల ప్రయాణం.. రెండు రోజుల కొండ ఎక్కడం

ఈ మ్యాప్ ఆధారంగా 2023లో పరిశోధకులు అత్యంత ఆసక్తికరమైన చెట్టు కోసం బయలుదేరారు. దాదాపు 20 కిలోమీటర్లు నది వెంట నడిచిన తర్వాత, మరో రెండు రోజుల పాటు కఠినమైన కొండ ప్రాంతాల్లో ప్రయాణించారు. చివరకు భారీ తైవానియా ఫిర్ చెట్టు వద్దకు చేరుకున్నారు. ప్రొఫెషనల్ చెట్టు ఎక్కే నిపుణులు చెట్టు పైభాగానికి చేరుకుని, అక్కడి నుంచి కొలతల టేపును నేల వరకు వదిలారు. అప్పుడు చెట్టు ఎత్తు 84.1 మీటర్లు అని నిర్ధారించారు.ఈ భారీ చెట్టుకు ‘హెవెన్ స్వోర్డ్ ఆఫ్ ది డాన్ రివర్’ అనే పేరు పెట్టారు.

‘రాక్షస చెట్ల ఆలయాలు’

పరిశోధనలో మరో అద్భుతమైన విషయం కూడా బయటపడింది. తైవాన్‌లోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో 65 మీటర్లకంటే ఎక్కువ ఎత్తున్న అనేక చెట్లు ఒకేచోట పెరుగుతున్న ప్రాంతాలను పరిశోధకులు గుర్తించారు. మౌంట్ బెన్యా సమీపంలో దాదాపు 30 భారీ తైవానియా ఫిర్ చెట్లు ఉన్న పురాతన అడవిని కూడా గుర్తించారు. పరిశోధకులు ఇలాంటి ప్రాంతాలను ‘టెంపుల్స్ ఆఫ్ జెయింట్స్’ , అంటే ‘భారీ చెట్ల ఆలయాలు’గా అభివర్ణిస్తున్నారు.

కార్బన్‌ను నిల్వ చేసే సహజ సంపద

ఈ భారీ చెట్ల ప్రత్యేకత కేవలం వాటి ఎత్తులోనే లేదు. 2024లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, తైవాన్‌లోని పురాతన అడవుల్లో భారీ మొత్తంలో కార్బన్ నిల్వ ఉంటుంది. అందువల్ల ఈ అడవులు ప్రకృతికి ఎంతో కీలకం. అవి వాతావరణంలో కార్బన్‌ను నిల్వ చేయడంతో పాటు అనేక రకాల జీవులకు ఆవాసంగా ఉంటాయి. వాతావరణాన్ని సమతుల్యం చేయడంలో కూడా సహాయపడతాయి. అందుకే శాస్త్రవేత్తల దృష్టిలో ఈ 84 మీటర్ల భారీ చెట్టు కేవలం ఒక ప్రపంచ రికార్డు కాదు.ఇది వేల సంవత్సరాలుగా ప్రకృతిని కాపాడుతున్న పురాతన అడవుల విలువను గుర్తు చేసే సజీవ సాక్ష్యం.