ఇతరుల కోసం కాదు.. నీ విలువ కోసం జీవించు
బాధలు భారం కాదు.. బలంగా మలుచుకో
తిరిగి రానివి కాలం, కోల్పోయిన జీవితం మాత్రమే
ప్రతి ఒక్కరికి తిరిగిరానివి కాలం, కోల్పోయిన జీవితం. ప్రతి మనిషి జీవితంలో ఒక రోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజు ఎవరూ మనల్ని ప్రశ్నించకపోవచ్చు. కాలమే మన ముందు నిల్చుని ఒక ప్రశ్న అడుగుతుంది. ‘నేను నీకు ఇచ్చిన ఈ జీవితాన్ని ఎంతవరకు సార్థకత చేసుకున్నావు?’ అని.
దానికి సమాధానం చెప్పేది మన మాటలు కాదు.. మనం జీవించిన విధానమే.
చాలామంది జీవితమంతా ఇతరులు ఏమనుకుంటారో అనే భయంతోనే గడిపేస్తారు. తమ ఆలోచనలను పక్కన పెట్టి, తమ ఆనందాన్ని త్యాగం చేసి, అందరినీ సంతోషపెట్టే ప్రయత్నంలో చివరకు తమను తాము కోల్పోతారు. అందరికీ నచ్చే విధంగా వ్యక్తి మారాలని తపనపడుతూ, అద్దంలో కనిపించే నిజమైన మనిషి రూపాన్ని మాత్రం మరచిపోతారు.
మనుషుల కోసం మారడం తప్పు కాదు. దానిలో మన వ్యక్తిత్వం, విలువలు, ఆత్మగౌరవం లేకపోతే అది జీవితానికి నష్టం.
జీవితంలో సమస్యలు రాకుండా ఉండవు. అపజయాలు, అవమానాలు, నిరాశ, ఒంటరితనం.. ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవన ప్రయాణంలో భాగమే. అయితే అవే పరిస్థితులు కొందరిని కుంగదీస్తాయి. మరికొందరిని మరింత దృఢంగా తయారు చేస్తాయి. తేడా పరిస్థితుల్లో కాదు.. వాటిని చూసే మన దృక్పథంలో ఉంటుంది.
ఒక గాయం మనిషిని బలహీనుడిని చేయొచ్చు. అదే గాయం అతడిని మరింత బలమైన వ్యక్తిగా కూడా మార్చొచ్చు. ప్రతి కష్టం ఒక పాఠం. ప్రతి అపజయం ఒక కొత్త మార్గానికి సూచిక. ప్రతి కన్నీటి బొట్టు రేపటి చిరునవ్వుకు దారి కావచ్చు.
జీవితం అంటే రోజులు గడపడం కాదు. ప్రతి రోజు అవకాశంగా మలచుకోవడం. మన కలల సాకారానికి అడుగు వేయడం. మనకు ఇష్టమైన పనిని చేయడం. మనల్ని మనం గౌరవించుకోవడం. మన కారణంగా మరొకరి జీవితంలో వెలుగు నింపగలగడం.
ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ‘ఇంకొంచెం ధైర్యంగా ఉంటే బాగుండేది.. ఇంకొంచెం నా కోసం బతికి ఉంటే బాగుండేది’ అనే పశ్చాత్తాపం మిగలకూడదు.
‘ఎన్ని కష్టాలు వచ్చినా నా జీవితాన్ని నేనే నిర్మించుకున్నాను’ అనే గర్వంతో పయనించాలి. ఈ ప్రపంచంలో తిరిగి కొనుక్కోలేనివి రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి కాలం.. రెండోది కోల్పోయిన జీవితం. డబ్బు తిరిగి సంపాదించవచ్చు. అవకాశాలు మళ్లీ రావచ్చు. వృథా చేసిన సమయం, అర్థం లేకుండా గడిచిన జీవితం ఎప్పటికీ తిరిగి రావు.
అందుకే ప్రతి ఉదయాన్ని ఒక కొత్త అవకాశంగా స్వాగతించండి. ప్రతి సవాలును ఒక మెట్టుగా భావించండి. ఇతరుల చప్పట్ల కోసం కాదు.. మీ మనసు మీకోసం చప్పట్లు కొట్టేలా జీవించండి. కాలం అడిగే ఆ ఒక్క ప్రశ్నకు, మీ జీవితం గర్వంగా సమాధానం చెప్పేలా ఈ రోజే జీవించడం ప్రారంభించండి.
