తోడు ఉంటే.. కష్టం చిన్నదే

Relations

మనిషికి మనిషే భరోసా

జీవితంలో ప్రతి సమస్యను డబ్బుతో, శక్తితో లేదా హోదాతోనే ఎదుర్కోలేం. కొన్ని సందర్భాల్లో ‘నేనున్నా’ అనే ఒక్క మాటే కుంగిపోయిన మనసుకు కొత్త ధైర్యాన్ని ఇస్తుంది. మనిషి బలహీనపడేది సమస్యల వల్ల కాదు. తాను ఒంటరివాడిననే భావన వల్ల. పక్కన ఎవరో ఉన్నారనే నమ్మకం కలిగితే అసాధ్యమనుకున్న పనిని సైతం సాధించగలడు. అందుకే మనిషికి మనిషే నిజమైన భరోసా.

మనిషి జీవితంలో భయం, బాధ, నిరాశ ఎప్పుడో ఒకసారి ఎదురవుతాయి. అలాంటి సమయంలో సమస్య కంటే పెద్దది ఒంటరితనం. తన కష్టాన్ని వినేవారు లేరనే భావనే మనిషిని మరింత బలహీనుడిని చేస్తుంది. కానీ పక్కన ఒక మనిషి నిలబడి ‘ఏం కాదు… నేనునున్నాను’ అని చెప్పిన క్షణం నుంచి అతనిలో కొత్త ఆత్మవిశ్వాసం పుడుతుంది. భరోసా అనేది కేవలం ఓదార్పు కాదు. అది మనిషిలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకొచ్చే బలం. ఒకరు తోడుగా ఉన్నారనే నమ్మకం భయాన్ని తగ్గిస్తుంది. ఆ నమ్మకమే ముందడుగు వేయించే ధైర్యంగా మారుతుంది. జీవితంలో ఎన్నో విజయాల వెనుక ఈ మానసిక బలమే ఉంటుంది.

ఉమ్మడి కుటుంబం.. భరోసా

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ  వ్యవస్థలో పెద్దలు, బంధువులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు అందరూ ఒకరికొకరు అండగా ఉండేవారు. ‘ఏం జరిగినా మేమున్నాం’ అనే భరోసా ప్రతి కుటుంబానికి ఉండేది. అందుకే ఎన్నో కష్టాలు వచ్చినా వాటిని కలిసి ఎదుర్కొనేవారు. ఇప్పుడు కుటుంబాలు చిన్నవయ్యాయి. బంధాలు దూరమయ్యాయి. అవసరమైన సమయంలో అండగా నిలిచే మనుషులు తగ్గిపోయారు. ఈ మార్పు మనుషుల్లో అభద్రతా భావాన్ని పెంచుతోంది.

నేటి సమాజంలో ఒత్తిళ్లు, ఆందోళనలు, మానసిక సమస్యలు పెరగడానికి ఒంటరితనం కూడా ఒక ప్రధాన కారణంగా మారుతోంది. డబ్బు, సౌకర్యాలు, సాంకేతికత పెరిగినా, ఆప్యాయంగా పలకరించే మనుషులు తగ్గిపోతే జీవితం వెలితిగా మారుతుంది. అందుకే సంబంధాలను నిలబెట్టుకోవడం, ఒకరికి ఒకరు అండగా ఉండడం ఇప్పటి కాలంలో మరింత అవసరమైంది.ఎవరికైనా పెద్ద సహాయం చేయలేకపోవచ్చు. కానీ వారి బాధను వినడం, ఓదార్పు చెప్పడం, అవసరమైతే చేయి అందించడం ప్రతి ఒక్కరూ చేయగలిగిన గొప్ప పని. ఒక చిన్న ప్రోత్సాహం, ఒక ధైర్యం చెప్పే మాట, ఒక భుజం తట్టడం, ఇవి కొన్నిసార్లు ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తాయి.

మనం ఇచ్చే భరోసా ఎవరికైనా కొత్త జీవితాన్ని ఇవ్వొచ్చు. కష్టాల్లో ఉన్నవారికి ‘నేనున్నా  అని చెప్పే మనసు పెంచుకుందాం. పెద్ద సహాయం చేయలేకపోయినా, ఒక మంచి మాటతో అయినా వారి మనోధైర్యాన్ని పెంచుదాం. ఎందుకంటే మనిషిని నిలబెట్టేది సంపద కాదు మనిషే,అందుకే మనిషికి మనిషే నిజమైన భరోసా.