అమరావతి: శాసనసభలో విప్ గా కొనసాగుతున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన పదవికి రాజీనామా చేశారు. జనసేన అధ్యక్షుడు, ఏపీ డీసీఎం పవన్ కళ్యాణ్ తో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అత్యవసర సమావేశం కావటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఓ మహిళ వివాదంలో అరవ శ్రీధర్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ అంశాన్ని స్వయంగా సమీక్షించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతికి పిలిపించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో తనపై ఉన్న ఆరోపణలు వివాదాలపై అరవ శ్రీధర్ , పవన్ కళ్యాణ్ కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
మహిళ వివాదం నేపథ్యంలో అరవ శ్రీధర్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. ఆయనపై వచ్చిన ఆరోపణలపై పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ నివేదికను కూడా పవన్ కళ్యాణ్ కు సమర్పించినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య శాసనసభ విప్ పదవికి ఆయన రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పవన్ కళ్యాణ్ కు స్వయంగా అందజేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. తన రాజీనామాపై అరవ శ్రీధర్ స్పందిస్తూ వ్యక్తిగత కారణాలతో విప్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల నెలకొన్న వివాదాల నేపథ్యంలో శ్రీధర్ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
