పేరులోనే  కిల్.. పర్యావరణ, ఆరోగ్య స్నేహితురాలు .. సైకిల్ 

CYCLE

చిన్ననాటి స్నేహం, తొలి గురువు 

జూన్ 3 ప్రపంచ సైకిల్ దినోత్సవం 

  • పెట్రోల్ తాగదు… ప్రకృతిని బాధించదు… మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే సైకిల్ ఎప్పటికీ సామాన్యుడి మహారథమే

“ఉదయం ఇంటి పైకి వెళ్ళాను. ఇంటి మేడపై దుమ్ము పట్టిన ఒక పాత సైకిల్ నిశ్శబ్దంగా స్టాండ్ వేసుకుని నిలుచుంది. ఇంట్లో అందరి దృష్ఠిలో అది ఒక పాత వస్తువు మాత్రమే. కానీ నా  కళ్లలో మాత్రం అది ఒక జ్ఞాపకం… ఒక అనుబంధం… ఒక స్నేహం.. తొలి గురువు. జూన్ 3 సైకిల్ దినోత్సవం కావడంతో మేడపైకి వచ్చిన నాతో సైకిల్  మాట్లాడినట్టనిపించింది.

“ఏం.. గుర్తున్నానా?” అని సైకిల్ అడిగింది. . “నువ్వెవరు?” “నేనే రా… నీ చిన్ననాటి నేస్తం. నీ మొదటి వాహనం. నీకు పడిపోవడం నేర్పి, మళ్లీ లేవడం నేర్పిన సైకిల్ని .” నేను  ఒక నవ్వు  నవ్వాను . “అవును… నిన్ను ఎలా మర్చిపోగలను?”

సైకిల్ మెల్లగా చెప్పింది…”నీ కాళ్లు నా పెడల్ మీద సరిగ్గా చేరనప్పుడు కూడా నన్నే ఎక్కేవాడివి. మొదటిసారి అదుపు తప్పి పడిపోయినప్పుడు నీ మోకాళ్లకు గాయాలయ్యాయి.. కానీ ఆ రోజు ఎందుకో నువ్వు ఏడవలేదు. ఎందుకంటే నిన్ను మళ్లీ నడవాలని  ప్రోత్సహించింది నేనే.”

నేను మౌనంగా విన్నాను..”గుర్తుందా? స్కూల్‌కు, ట్యూషన్‌కు, స్నేహితుల ఇంటికి… ఎక్కడికైనా నన్నే తీసుకెళ్ళేవాడివి. నాకు ఇంధనం, అవసరం లేదు. బ్యాటరీ అవసరం లేదు. కాస్త గాలి నింపితే చాలు… నీ ఆలోచనలతోపాటు  పాటు నేనూ పరిగెత్తేదాన్ని.”కొద్దిసేపు ఆగి సైకిల్ మళ్లీ మాట్లాడింది.

“నా పేరులో ‘కిల్’ ఉన్నా.. నేను ఎవరినీ చంపను. కాలుష్యాన్ని మాత్రం తగ్గిస్తాను. నీ ఆరోగ్యాన్ని పెంచుతాను. ఖర్చు లేకుండా ప్రయాణం చేయిస్తాను.” నేను తలా ఊపాను.. “కానీ ఇప్పుడు నువ్వు పెద్దవాడివయ్యావు. బైక్ కొన్నావు. తర్వాత కారు కూడా వచ్చింది. నేను మాత్రం ఈ మూలన నిలబడి చూస్తూనే ఉన్నాను.” ఆ మాటల్లో బాధ కనిపించింది.

“నిన్ను తొక్కితే  నామోషీ అనిపించే రోజులు వచ్చాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకో…” “ఏమిటది?” అడిగాను . “నన్ను నడపడం నేర్చుకున్నాకే నువ్వు స్కూటర్ నడిపావు. మోటార్ సైకిల్ మీద దూసుకెళ్లావు. కారు స్టీరింగ్ పట్టావు. నీ జీవిత ప్రయాణంలో మొదటి అడుగు నేనే. నీ ఎదుగుదలకు తొలి మెట్టు నేనే. నా  కళ్ళు చెమర్చాయి.

సైకిల్ చిరునవ్వుతో చెప్పింది… “నన్ను మర్చిపోవడం మనుషుల గుణం కావచ్చు. కానీ నేను చేసిన మేలు మాత్రం నీ జ్ఞాపకాల నుంచి ఎప్పటికీ చెరిగిపోదు. ఎందుకంటే నేను కేవలం ఒక వాహనం కాదు… నీ బాల్యానికి చిహ్నం. నీ స్వేచ్ఛకు రూపం. నీ ఆరోగ్యానికి స్నేహితురాలు .”   

నేను  మేడపై నుంచి సైకిల్‌ను కిందికి దించాను . దుమ్ము తుడిచా.. టైర్లలో గాలి నింపాను. కొన్ని నిమిషాల తర్వాత కాలనీలో నేను  సైకిల్ మీద వెళ్తుండగా, నా  ముఖంలో కనిపించిన ఆనందం… ఏ ఖరీదైన కారు అందించలేకపోయింది.

సందేశం:
సైకిల్ కేవలం ఒక వాహనం కాదు. అది ఆరోగ్యానికి బాట, పర్యావరణానికి మిత్రం, బాల్యానికి జ్ఞాపకం, జీవితానికి తొలి గురువు. ప్రపంచ సైకిల్ దినోత్సవం మనకు  సాధారణమే కానీ అసాధారణమైన సహచరుడి విలువను గుర్తుచేస్తుంది.