– ఈజిప్టు చరిత్రకు కొత్త ఆధారాలు
ఈజిప్టులోని కోమ్ ఓంబో ఆలయం దాదాపు 2,000 సంవత్సరాల పాటు మొసలి ఆరాధనకు అత్యంత ప్రముఖ కేంద్రంగా నిలిచింది. నైలు నది, సంతానోత్పత్తి, రాజాధికారానికి ప్రతీకగా భావించే మొసలి తల కలిగిన దేవుడు సోబెక్ కు అంకితమైన ఈ ఆలయంలో వందలాది మొసలి మమ్మీలను పవిత్ర కానుకలుగా సమర్పించేవారు. ఇప్పుడు ఆధునిక డీఎన్‌ఏ పరీక్షలు, అత్యాధునిక ఇమేజింగ్ సాంకేతికతల సహాయంతో ఆ మమ్మీల్లో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి.
వందలాది మొసలి మమ్మీల ఆవిష్కరణ
పురావస్తు శాస్త్రవేత్తలు కోమ్ ఓంబోలో చిన్న మొసలి పిల్లల నుంచి పూర్తిగా ఎదిగిన పెద్ద మొసళ్ల వరకు వందలాది మమ్మీలను గుర్తించారు. చాలా కాలంగా పరిశోధకుల్లో ఒక సందేహం ఉండేది. ఈ మొసళ్లను ఆలయాల కోసం ప్రత్యేకంగా పెంచారా? లేక అడవుల్లో పట్టుకుని మమ్మీలుగా మార్చారా? ఇటీవల వెలువడిన రెండు శాస్త్రీయ పరిశోధనలు ఈ ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు అందించాయి.
డీఎన్‌ఏ పరీక్షలో కొత్త మొసలి జాతి గుర్తింపు
జర్నల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సైన్స్ రిపోర్ట్స్ లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో కోమ్ ఓంబోలో లభించిన పెద్ద మొసలి మమ్మీ నుంచి డీఎన్‌ఏను విశ్లేషించారు. ఈ పరీక్షలో ఆ మొసలి సాధారణంగా నైలు నదిలో కనిపించే నైల్ మొసలి కాదని, పశ్చిమ ఆఫ్రికా మొసలి జాతికి చెందినదని తేలింది. ఈ ఆవిష్కరణతో ప్రాచీన ఈజిప్టు మతాచారాల్లో ఈ అరుదైన మొసలి జాతి గతంలో భావించిన దానికంటే ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పరిశోధకురాలు ఈవోన్ ఆర్. హెక్కాలా సహా శాస్త్రవేత్తల బృందం ప్రకారం, ఈ ఫలితాలు శతాబ్దాల క్రితమే వచ్చిన చారిత్రక వివరాలకు బలం చేకూరుస్తున్నాయి.
గ్రీకు చరిత్రకారుడు హెరోడోటస్ ఈజిప్టులో వివిధ రకాల మొసళ్లు ఉన్నాయని పేర్కొనగా, 1807లో ఫ్రెంచ్ జంతుశాస్త్రవేత్త ఎటియెన్ జెఫ్రాయ్ సెయింట్-హిలైర్ కూడా నైలు నది వెంట ఒకటి కంటే ఎక్కువ మొసలి జాతులు నివసించాయని ప్రతిపాదించారు. తాజా జన్యు ఆధారాలు ఈ వాదనలు సరైనవాని సూచిస్తున్నాయి . పశ్చిమ ఆఫ్రికా మొసలి ఒకప్పుడు ఈజిప్టులో నివసించేదని, అనంతరం పర్యావరణ మార్పులు, సహారా ఎడారి విస్తరణ కారణంగా అక్కడి నుంచి అంతరించిపోయిందని పరిశోధకులు భావిస్తున్నారు.
ఆలయాల కోసం అడవి మొసళ్లను వేటాడేవారు
మరో అధ్యయనం వైల్డ్ క్రొకోడైల్స్ హాంటెడ్ టు మేక్ మమ్మీస్ ఇన్ రోమన్ ఈజిప్ట్ ఎవిడెన్స్ ఫ్రమ్ సిన్చరోట్రాన్ ఇమేజింగ్”లో అత్యంత అధిక స్పష్టత కలిగిన ఇమేజింగ్ సాంకేతికతతో మరో మొసలి మమ్మీని పరిశీలించారు. ఆ పరిశోధనలో మొసలి శరీరంపై గాయాలు, కడుపులో మిగిలి ఉన్న ఆహార అవశేషాలు గుర్తించారు. వీటి ఆధారంగా ఆ మొసలి స్వేచ్ఛగా అడవిలో జీవించిన తర్వాత వేటాడబడి, అనంతరం మమ్మీగా మార్చారని తేలింది. కనీసం కొన్ని మొసళ్లను ఆలయాల్లో పెంచకుండా నేరుగా ప్రకృతి నుంచి పట్టుకుని సోబెక్ దేవుడికి పవిత్ర సమర్పణగా అర్పించినట్లు స్పష్టమవుతోంది.
ఈజిప్టు సహజ చరిత్రకు కొత్త వెలుగు
కోమ్ ఓంబో ఆలయం పరిసరాల్లోని మొసలి సమాధులు కేవలం పురావస్తు సంపద మాత్రమే కాదు. వేల సంవత్సరాల క్రితం నైలు నది పరిసర జీవవైవిధ్యం గురించి విలువైన జీవశాస్త్ర సమాచారాన్ని కూడా భద్రపరిచాయి. పురావస్తు పరిశోధనలు, ప్రాచీన డీఎన్‌ఏ విశ్లేషణ, ఆధునిక ఇమేజింగ్ సాంకేతికతలను కలిపి శాస్త్రవేత్తలు ప్రాచీన ఈజిప్టు ప్రజలు నైలు నది వన్యప్రాణులతో ఎలా మమేకమయ్యారో పునర్నిర్మిస్తున్నారు. ఈ మొసలి మమ్మీలు మొసలి జాతుల వ్యాప్తి, ఉత్తర ఆఫ్రికాలో జరిగిన పర్యావరణ మార్పులు, అలాగే మత విశ్వాసాలు మరియు ప్రకృతి మధ్య ఉన్న గాఢమైన సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో కీలక ఆధారాలుగా నిలుస్తున్నాయి.
దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం పవిత్ర కానుకలుగా సమాధి చేసిన ఈ మొసలి మమ్మీలు నేటికీ ప్రాచీన ఈజిప్టు నాగరికత, దాని మత విశ్వాసాలు, జీవవైవిధ్యం, పర్యావరణ చరిత్ర గురించి కొత్త విషయాలను వెలుగులోకి తీసుకువస్తూనే ఉన్నాయి.
