భూమిపై తొలి జీవులు సముద్ర స్పంజిక లేనా?

Sponge

 ఎంఐటీ పరిశోధనలో కొత్త ఆధారాలు

భూమిపై తొలి జంతువులు ఏవి? అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు కొత్త సమాధానం కనిపెట్టారు . అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) పరిశోధకులు భూమిపై మొదట జీవించిన జంతువులు ప్రాచీన సముద్ర స్పంజికలు (Sea Sponges) అని సూచించే బలమైన ఆధారాలను గుర్తించారు.

541 మిలియన్ సంవత్సరాలకు పైగా పురాతనమైన శిలల్లో రసాయన శిలాజాలను వారు గుర్తించారు. ఇవి నేటి డెమో స్పంజికల పూర్వీకులతో సంబంధం ఉన్న జీవ అణువుల ఆనవాళ్లు. దీని వల్ల కేంబ్రియన్ కాలంలో సంక్లిష్ట జీవులు విస్తరించకముందే స్పాంజ్‌లు సముద్రాల్లో జీవించాయని తెలుస్తోంది.

రాళ్లలో దాగిన జీవ చరిత్ర

పరిశోధకులు ఒమాన్, పశ్చిమ భారతదేశం, సైబీరియాలోని పురాతన శిలలను విశ్లేషించారు. అందులో స్టెరేన్‌లు అనే ప్రత్యేక రసాయన గుర్తులను వెతికారు. ఇవి కణాల పొరల్లో ఉండే స్టెరాల్స్ నుంచి ఏర్పడే స్థిరమైన జీవ అణువుల అవశేషాలు. ఈ పరిశోధనలో అత్యంత అరుదైన C30, C31 స్టెరేన్‌లు లభించాయి. ఇవి డెమో స్పంజికల నుంచే ఉద్భవిస్తాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ రసాయన గుర్తులు భూమిపై తొలి జంతువుల ఉనికికి బలమైన ఆధారాలుగా నిలిచాయి.

ప్రయోగశాలలోనూ నిర్ధారణ

2009లో MIT శాస్త్రవేత్తలు 30-కార్బన్ స్టెరేన్‌ను స్పంజికలతో అనుసంధానించారు. తాజా అధ్యయనంలో మరింత అరుదైన 31-కార్బన్ స్టెరేన్ కూడా గుర్తించారు. అనంతరం అదే అణువులను ప్రయోగశాలలో తయారుచేసి పరీక్షించారు. సహజంగా ఈ రసాయనాలు స్పంజికల ద్వారా మాత్రమే ఉత్పత్తి అవుతాయని నిర్ధారించారు.

ప్రధాన పరిశోధకురాలు లుబ్నా షావర్ ప్రకారం, ఈ స్టెరేన్‌లు భౌగోళిక ప్రక్రియల వల్ల కాకుండా జీవుల వల్లే ఏర్పడ్డాయని ఈ పరిశోధన స్పష్టంగా నిరూపించింది. ఇది ఇప్పటివరకు గుర్తించిన తొలి జంతు జీవనానికి సంబంధించిన అత్యంత బలమైన రసాయన ఆధారాల్లో ఒకటిగా ఆమె పేర్కొన్నారు.

స్పంజికల ప్రాముఖ్యత ఏమిటి?

స్పంజికలు చాలా సాధారణ జీవుల్లా కనిపించినప్పటికీ, ఏకకణ జీవుల నుంచి బహుకణ జంతువులుగా పరిణామం చెందడంలో ఇవి కీలక దశగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ జీవులు సముద్ర నీటిని వడకట్టి ఆహారం తీసుకునే క్రమంలో సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయిలను పెంచడంలో పాత్ర పోషించాయని అంచనా. దీంతో తరువాత మరింత సంక్లిష్టమైన జంతువుల పరిణామానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం కేంబ్రియన్ కాలంలో జీవ వైవిధ్యం వేగంగా విస్తరించింది.

శిలాజాల కంటే రసాయన ఆధారాలే కీలకం

మెత్తని శరీర నిర్మాణం కలిగిన స్పంజికల వంటి జీవులు సాధారణంగా ఎముకలు లేదా గుల్లలు లేకపోవడంతో భౌతిక శిలాజాలు చాలా అరుదుగా లభిస్తాయి. అలాంటి సందర్భాల్లో ఈ రసాయన శిలాజాలు పురాతన జీవాల చరిత్రను తెలుసుకునేందుకు విలువైన ఆధారాలుగా నిలుస్తున్నాయి.

ఇకపై మరిన్ని పరిశోధనలు

ఇప్పటికే ఈ ప్రత్యేక స్టెరేన్‌ల జీవసంబంధ మూలాన్ని నిర్ధారించిన శాస్త్రవేత్తలు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల పురాతన శిలల్లో కూడా ఇలాంటి రసాయన గుర్తులను వెతకాలని భావిస్తున్నారు. దీనివల్ల భూమిపై తొలి జంతువులు ఎప్పుడు ఉద్భవించాయనే కాలక్రమాన్ని మరింత ఖచ్చితంగా నిర్ణయించవచ్చని ఆశిస్తున్నారు.

ఎంఐటికు చెందిన ప్రొఫెసర్ రోజర్ సమన్స్ మాట్లాడుతూ, “స్పంజికలే భూమిపై తొలి జంతువుల్లో ఒకటని సూచించే మూడు స్వతంత్ర ఆధారాలు ఇప్పుడు పరస్పరం ఒకే విషయాన్ని నిర్ధారిస్తున్నాయి” అని తెలిపారు. భవిష్యత్ పరిశోధనలు తొలి బహుకణ జీవులు సముద్ర పరిస్థితులకు ఎలా అనుగుణంగా మారాయో మరింత స్పష్టత ఇవ్వనున్నాయని ఆయన చెప్పారు.