ప్రయోగశాలలో రసాయనాలతో కృత్రిమ కణం సృష్టి 

CELL

జీవశాస్త్ర రంగంలో శాస్త్రవేత్తలు మరో కీలక ముందడుగు వేశారు. చరిత్రలో తొలిసారిగా, ఇప్పటికే ఉన్న జీవకణాన్ని మార్చకుండా, పూర్తిగా నిర్జీవ రసాయన భాగాలతో ప్రయోగశాలలో ఒక కృత్రిమ కణాన్ని విజయవంతంగా రూపొందించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాకు చెందిన పరిశోధకులు కేట్ ఎడమల, ఆరోన్ ఎంగెల్హార్ట్ నేతృత్వంలోని బృందం అభివృద్ధి చేసిన ఈ కణానికి ‘స్పుడ్ సెల్’ అని పేరు పెట్టారు.ఈ కృత్రిమ కణం పోషకాలను స్వీకరించడం, పెరగడం, తన జన్యుపదార్థం (డీఎన్ఏ)ను కాపీ చేసుకోవడం, విభజన చెందడం వంటి జీవకణాల ప్రాథమిక లక్షణాలను ప్రదర్శించింది. పోషకాలు పరిమితంగా ఉన్న పరిస్థితుల్లో కొన్ని కణాలు వేగంగా పెరిగి మిగతా కణాలపై ఆధిక్యం సాధించడం ద్వారా సహజ ఎంపికను పోలిన ప్రవర్తనను కూడా చూపించింది.

ఈ పరిశోధనలో అత్యంత విశేషమైన అంశం ‘బాటమ్-అప్’  విధానం. గతంలో శాస్త్రవేత్తలు ఇప్పటికే ఉన్న జీవకణాల జన్యువులను సవరించి ప్రయోగాలు నిర్వహించగా, ఈసారి మాత్రం సింథటిక్ డీఎన్ఏ, ఎంజైమ్‌లు ,ఇతర రసాయన భాగాలను మాత్రమే ఉపయోగించి కణాన్ని పూర్తిగా కొత్తగా నిర్మించారు. సుమారు 90 కిలోబేస్ జతలు  పరిమాణం గల అత్యంత చిన్న జన్యు వ్యవస్థతో ఈ కణం పనిచేయడం మరో ప్రత్యేకత. అయితే, స్పుడ్ సెల్ ను ఇప్పుడే పూర్తిస్థాయి జీవిగా పరిగణించడం సరైంది కాదు. ఇది ఇంకా కొన్ని కీలక జీవరసాయన భాగాల కోసం బయటి సహాయంపై ఆధారపడుతోంది. అయినప్పటికీ, జీవం ఎలా ఆవిర్భవించింది? కనీస జీవకణం ఎలా పనిచేస్తుంది? వంటి ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు కనుగొనే దిశగా ఇది ఒక కీలక మైలురాయిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఈ సాంకేతికత భవిష్యత్తులో కొత్త ఔషధాల అభివృద్ధి, బయోటెక్నాలజీ, పర్యావరణహిత పారిశ్రామిక ఉత్పత్తులు, బయోఫ్యూయల్స్ తయారీ వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిశోధనను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు బయోటిక్  అనే సంస్థను కూడా ప్రారంభించారు.