– శాస్త్రవేత్తల ఆసక్తికర పరిశోధన
భూమిపై వర్షం అంటే నీటి చినుకులే గుర్తుకు వస్తాయి. కానీ మన సౌర కుటుంబంలోని కొన్ని గ్రహాల్లో మాత్రం వజ్రాల వర్షం కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా, ప్రయోగశాల పరీక్షలు, కంప్యూటర్ నమూనాలు, దశాబ్దాల పరిశోధనలు ఈ సిద్ధాంతానికి బలమైన మద్దతు ఇస్తున్నాయి. ఈ వజ్రాలు గ్రహాల ఉపరితలంపై కనిపించవు. అవి వేల కిలోమీటర్ల లోతులో, తీవ్రమైన పీడనం, అధిక ఉష్ణోగ్రతల మధ్య ఏర్పడి గ్రహాల అంతర్భాగాల వైపు కురుస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు.
వజ్రాల వర్షం ఎక్కడ కురుస్తుంది?
ఈ వింత వాతావరణం యురేనస్ , నెప్ట్యూన్ అనే సౌర కుటుంబంలోని రెండు ‘ఐస్ జెయింట్’ గ్రహాల్లో ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గ్రహాల లోపల భారీ మొత్తంలో నీరు, మీథేన్, అమ్మోనియా వంటి పదార్థాలు అత్యంత పీడనంలో, వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద ఉంటాయి.
వజ్రాలు ఎలా ఏర్పడతాయి?
ఈ ప్రక్రియలో మీథేన్ (CH₄) కీలక పాత్ర పోషిస్తుంది. గ్రహాల లోపల పీడనం భూమి వాతావరణ పీడనం కంటే లక్షల నుంచి మిలియన్ల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు వేల డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటాయి.
ఈ పరిస్థితుల్లో మీథేన్ అణువులు విచ్ఛిన్నమై హైడ్రోజన్ వేరవుతుంది. మిగిలిన కార్బన్ అణువులు ఒకదానితో ఒకటి కలసి స్ఫటికాలుగా మారతాయి. ఈ స్ఫటికాలే వజ్రాలుగా రూపుదిద్దుకుంటాయి. ఈ వజ్రాలు చుట్టూ ఉన్న పదార్థాల కంటే బరువుగా ఉండటంతో గ్రహం లోపలి భాగాల వైపు క్రమంగా దిగిపోతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ప్రయోగశాలలోనే వజ్రాలను సృష్టించారు
ఈ సిద్ధాంతం కేవలం ఊహ కాదు. 2017లో అమెరికాలోని SLAC నేషనల్ యాక్సిలేటర్ లాబరేటరీ , జర్మనీలోని హెల్మ్హోల్ట్జ్-జన్తరం డ్రేస్దేం-రోసెండోర్ఫ్ (HZDR) పరిశోధకులు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎక్స్-రే లేజర్ సహాయంతో యురేనస్, నెప్ట్యూన్ గ్రహాల లోపలి పరిస్థితులను ప్రయోగశాలలో సృష్టించారు.
మీథేన్లా ప్రవర్తించే కార్బన్, హైడ్రోజన్ అధికంగా ఉన్న ప్లాస్టిక్‌ను తీవ్రమైన పీడనానికి గురిచేయగా, సెకనులో బిలియన్ వంతు సమయంలోనే సూక్ష్మ వజ్రాలు ఏర్పడినట్లు వారు గుర్తించారు. ఈ ఫలితాలు నేచర్ ఆస్ట్రానమీ పత్రికలో ప్రచురితమయ్యాయి. అనంతర ప్రయోగాల్లో ఆక్సిజన్‌ను కూడా చేర్చడంతో వజ్రాల ఏర్పాటుకు మరింత అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని తేలింది.
ఎందుకు ఈ పరిశోధన ముఖ్యమైనది?
వజ్రాల వర్షం ఒక ఆసక్తికరమైన ప్రకృతి దృశ్యం మాత్రమే కాదు. బిలియన్ల సంవత్సరాలుగా ఈ ప్రక్రియ కొనసాగి ఉంటే, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాల గుండె భాగాల చుట్టూ భారీ వజ్రాల పొరలు ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక గ్రహాల లోపల వేడి ఎలా ప్రసరిస్తుందో, అయస్కాంత క్షేత్రాలు ఎలా ఏర్పడతాయో, గ్రహాల పరిణామం ఎలా జరిగిందో అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
ఇతర గ్రహాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందా ? మన సౌర కుటుంబం వెలుపల ఖగోళ శాస్త్రవేత్తలు వేలాది ప్లానెట్లు కనుగొన్నారు. వీటిలో చాలా వరకు యురేనస్, నెప్ట్యూన్లాంటి పరిమాణం, నిర్మాణం కలిగి ఉన్నాయి. అలాంటి గ్రహాల్లో కూడా ఇదే రకమైన పీడనం, ఉష్ణోగ్రతలు ఉంటే, వజ్రాల వర్షం విశ్వంలో సాధారణ ప్రక్రియే కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఏ అంతరిక్ష నౌక కూడా యురేనస్ లేదా నెప్ట్యూన్ లోతైన అంతర్భాగాలకు చేరుకోలేదు. అందువల్ల అక్కడ నిజంగా వజ్రాల వర్షం కురుస్తున్న దృశ్యాన్ని ప్రత్యక్షంగా ఎవరూ చూడలేదు.
