అంగారకుడిపై జీవం ఉందా? 

Mars

కొత్త ఆధారాలతో మళ్లీ మొదలైన అన్వేషణ

అంగారక గ్రహం చాలా కాలంగా జీవానికి అనుకూలం కాని,   ప్రతికూల వాతావరణం కలిగిన గ్రహంగా భావిస్తున్నారు. సౌర కుటుంబంలోని గ్రహాల్లో భూమికి అత్యంత దగ్గరగా పోలికలు ఉన్న గ్రహం కూడా మార్సే. ఇప్పుడు కొత్త పరిశోధనలు, నాసా పెర్సెవరెన్స్ రోవర్ తాజాగా సేకరించిన ఆధారాలు మార్స్‌పై గతంలో జీవం ఉండేందుకు అనుకూల పరిస్థితులు ఉండవచ్చనే ఆసక్తికరమైన అవకాశాన్ని సూచిస్తున్నాయి. మార్స్‌పై ఎప్పుడైనా జీవం ఉందా? అనే ప్రశ్న ప్రస్తుతం ఖగోళ శాస్త్రంలో సమాధానం లేని అతిపెద్ద ప్రశ్నల్లో ఒకటి. ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో జరుగుతున్న ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధన సదస్సు కాస్పర్లో కూడా ఈ అంశం ప్రధాన చర్చగా మారింది.

సూక్ష్మజీవులు ఉండి ఉండొచ్చా?

ఇటలీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్  కు చెందిన ఆర్కెట్రీ అబ్జర్వేటరీ పరిశోధకురాలు, ఆస్ట్రోబయాలజీ ప్రొఫెసర్ టెరెసా ఫోర్నారో పెర్సెవరెన్స్ మిషన్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఆమె ప్రకారం మార్స్‌పై జీవం ఉండవచ్చనే అవకాశాన్ని పెంచుతున్న అనేక ఆధారాలు ప్రస్తుతం లభిస్తున్నాయి. ముఖ్యంగా పెర్సెవరెన్స్ రోవర్ గుర్తించిన కొన్ని ఖనిజాలు భూమిపై సూక్ష్మజీవుల కార్యకలాపాల వల్ల ఏర్పడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాకుండా మార్స్‌పై సంక్లిష్టమైన సేంద్రీయ పదార్థాలు  గుర్తించారు. అయితే ఇవి జీవం ఉందని నిర్ధారించే ప్రత్యక్ష ఆధారాలు కావని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

భూమి అడుగున జీవించినట్టే మార్స్‌పై కూడా?

మార్స్‌పై ఎప్పుడైనా జీవం ఉన్నట్లయితే, అది మనం ఊహించేలా గ్రహ ఉపరితలంపై జీవించి ఉండకపోవచ్చని ఫోర్నారో చెబుతున్నారు. అక్కడి జీవం సూక్ష్మజీవుల రూపంలో భూమి లోపల ఉండి ఉండే అవకాశం ఉంది. ఉపరితలంపై నిరంతరం పడే హానికరమైన రేడియేషన్ నుంచి తప్పించుకోవడానికి అవి భూగర్భంలో ఆశ్రయం పొందుతు ఉండొచ్చన్నారు.  రాళ్లలోని రసాయన శక్తిని ఉపయోగించి జీవించి ఉండే అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు లభించిన ఆధారాలన్నీ పరోక్షమైనవే. ఉదాహరణకు మార్స్‌పై కనుగొన్న సేంద్రీయ పదార్థాల నిర్మాణం చాలా వరకు మారిపోయి ఉండటంతో, అవి ఎలా ఏర్పడ్డాయో ఖచ్చితంగా తెలుసుకోవడం కష్టంగా ఉంది. మార్స్ నుంచి సేకరించిన నమూనాలను భూమికి తీసుకువచ్చి ప్రయోగశాలల్లో విశ్లేషించినప్పుడే జీవం ఉనికిపై స్పష్టమైన సమాధానం లభించే అవకాశం ఉంది.

ఎక్సోమార్స్ కీలకం

ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మార్స్‌పైకి వెళ్లే మిషన్లు అత్యంత కీలకంగా మారనున్నాయి. వాటిలో ముఖ్యమైనది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ  నిర్వహిస్తున్న ఎక్సో మార్స్  మిషన్. ఈ మిషన్‌లో రోసాలిండ్ ఫ్రాంక్లిన్ రోవర్ ప్రధాన పాత్ర పోషించనుంది. దీని ప్రయోగం 2028లో జరగనుండగా, 2030లో మార్స్‌పై దిగేలా ప్రణాళిక రూపొందించారు. అయితే ఎక్సో మార్స్ మిషన్ ఇప్పటికే ప్రారంభమైంది. 2016లో ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్ అనే ప్రాథమిక అంతరిక్ష నౌకను మార్స్ వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు పంపారు.

2028లో రోసాలిండ్ ఫ్రాంక్లిన్ రోవర్ మార్స్‌   పైకి  చేరిన తర్వాత అక్కడి నేలను తవ్వి నమూనాలను సేకరించనుంది. ఇప్పటివరకు మార్స్‌పై పనిచేసిన రోవర్లు ప్రధానంగా ఉపరితలాన్ని మాత్రమే పరిశీలించాయి. కానీ రోసలిండ్ ఫ్రాంక్లిన్ దాదాపు రెండు మీటర్ల లోతు వరకు డ్రిల్ చేయగలదు. మార్స్‌పైకి పంపిన అత్యాధునిక శాస్త్రీయ పరికరాలను ఇందులో అమర్చనున్నారు. దీంతో మార్స్‌పై ఎప్పుడైనా జీవం ఉందా అనే ప్రశ్నకు మరింత ప్రత్యక్ష ఆధారాలు లభించే అవకాశం ఉంది.

పెర్సెవరెన్స్ రోవర్ కూడా కీలక ఆధారాలు సేకరిస్తోంది

మరోవైపు, నాసాకు చెందిన పెర్సెవరెన్స్ రోవర్ 2021 నుంచి మార్స్ ఉపరితలంపై పరిశోధనలు చేస్తోంది. ప్రాచీన జీవానికి సంబంధించిన సేంద్రీయ ఆనవాళ్ల కోసం ఇది నిరంతరం శోధిస్తోంది. మార్స్ 2020 మిషన్ మొదట కేవలం ఒక మార్షియన్ సంవత్సరం, అంటే భూమిపై సుమారు 687 రోజులు పనిచేసేలా రూపొందించారు. అయితే దాని పనితీరును నిరవధికంగా పొడిగించారు. ప్రస్తుతం కూడా పెర్సెవరెన్స్ సమర్థంగా పనిచేస్తూ, రాళ్లు మరియు మార్స్ మట్టికి సంబంధించిన నమూనాలను సేకరిస్తోంది.

2024 వేసవిలో సేకరించిన ఒక నమూనాలో సంభావ్య జీవసంబంధ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. అవి నిజంగా జీవం వల్ల ఏర్పడ్డాయా లేదా అనేది నిర్ధారించడానికి మరింత పరిశోధన అవసరం. నాసా అడ్మినిస్ట్రేటర్ సీన్ డఫీ ఈ ఆవిష్కరణను ఉద్దేశిస్తూ, మార్స్‌పై జీవం ఉనికికి తాము గతంలో కంటే మరింత దగ్గరయ్యామని పేర్కొన్నారు. అయితే శాస్త్రవేత్తలకు ఇంకా తుది సమాధానం లభించలేదు. మార్స్‌పై జీవం ఉందా? లేక అక్కడి రసాయన, భౌగోళిక ప్రక్రియలే ఈ ఆనవాళ్లకు కారణమా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రపంచం ఇప్పుడు మార్స్ నుంచి వచ్చే తదుపరి నమూనాలు, పరిశోధన ఫలితాల కోసం ఎదురుచూస్తోంది.