ఏఐకి అర్థం కాకుండా సందేశాలు పంపే కొత్త ‘గోస్ట్ ఫాంట్’

Ghost font

శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణ

కృత్రిమ మేధస్సు ఇప్పుడు ఫిట్‌నెస్ యాప్‌ల నుంచి డేటింగ్ యాప్‌ల వరకు ప్రతిచోటా ఉపయోగపడుతోంది . దీంతో వ్యక్తిగత సందేశాలను మనుషులు మాత్రమే చదువుతున్నారా? లేక ఏఐ కూడా వాటిని విశ్లేషిస్తోందా? అనే ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏఐకి సులభంగా అర్థం కాకుండా ఉండే కొత్త రకం ‘గోస్ట్ ఫాంట్ (Ghost ఫాంట్)’ ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

ఈ ఫాంట్‌ను రూపొందించిన ఎరిక్ లూ ప్రకారం, ఇది సాధారణ ఫాంట్‌లా పనిచేయదు. అక్షరాలను స్థిరంగా చూపించకుండా చలనాన్ని ఉపయోగించి సందేశాన్ని ప్రదర్శిస్తుంది. మనిషి కళ్లకు సందేశం స్పష్టంగా కనిపించినా, ప్రస్తుత ఏఐ మోడళ్లకు దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.

ఇది ఎలా పనిచేస్తుంది?

గోస్ట్ ఫాంట్‌లో చుక్కలు నిరంతరం కదులుతూ అక్షరాల ఆకారాన్ని రూపొందిస్తాయి. ఈ కదలికను మనిషి మెదడు సులభంగా గుర్తిస్తుంది. కానీ వీడియోను ఆపేస్తే అన్ని చుక్కలు కలిసిపోయి అసలు సందేశం కనిపించదు. అందువల్ల స్క్రీన్‌షాట్ తీసినా సందేశాన్ని గుర్తించడం సాధ్యం కాదు.

ఏఐని మోసం చేసే మరో ట్రిక్

ఈ ఫాంట్‌లో డీకాయ్ మెసేజ్ అనే అదనపు రక్షణ కూడా ఉంటుంది. ఏఐ ముందుగా ఈ నకిలీ సందేశాన్ని గుర్తించి అదే అసలు సందేశమని భావించే అవకాశం ఉంది. దీంతో అసలు సందేశం సురక్షితంగా ఉంటుంది.

పాత ప్రయత్నానికి కొత్త రూపం

2013లో డిజైనర్ సాంగ్ మున్ రూపొందించిన జెడ్ ఎక్స్ ఎక్స్ అనే ప్రత్యేక ఫాంట్ మనుషులకు చదవగలిగేలా, కానీ ఓసిఆర్ సాఫ్ట్‌వేర్‌కు అర్థం కాకుండా రూపొందించబడింది. అయితే ఆధునిక ఏఐ వ్యవస్థలు ఇప్పుడు ZXX ఫాంట్‌ను సులభంగా చదవగలుగుతున్నాయి. అందుకే ఎరిక్ లూ ఈసారి స్థిరమైన అక్షరాల బదులు కదలికను ఉపయోగించారు.

పరీక్షల్లో ఏమి తేలింది?

ఎరిక్ లూ ఈ ఫాంట్‌తో రూపొందించిన వీడియోలను ప్రముఖ ఏఐ మోడళ్లకు ఇచ్చి పరీక్షించారు. తాజా ఏఐ వ్యవస్థలు కూడా ఆ సందేశాలను సరిగ్గా గుర్తించడంలో ఇబ్బంది పడ్డాయని ఆయన తెలిపారు.

ఉపయోగాలు ఏమిటి?

గోస్ట్ ఫాంట్ భవిష్యత్తులో అనేక రంగాల్లో ఉపయోగపడే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. వ్యక్తిగత సందేశాల గోప్యతను కాపాడేందుకు
ఏఐ బాట్‌లను అడ్డుకునే క్యాప్చ వ్యవస్థల్లో ఆటోమేటెడ్ బాట్‌ల నుంచి సమాచారాన్ని రక్షించేందుకు.

ఇది శాశ్వత పరిష్కారమా?

ఎరిక్ లూ కూడా ఇది శాశ్వత రక్షణ కాదని అంగీకరించారు. ఏఐ వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్నందున, భవిష్యత్తులో ఈ ఫాంట్‌ను కూడా అవి చదివే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా, గోస్ట్ ఫాంట్‌ను మనుషులు కూడా సాధారణ అక్షరాలంత సులభంగా చదవలేరని ఆయన పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన

ఈ ఫాంట్‌ను ప్రయత్నించిన నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
‘ఇదే భవిష్యత్తు క్యాప్చ కావచ్చు’ అని కొందరు అభిప్రాయపడ్డారు. ‘ఏఐ త్వరలో దీనినీ నేర్చుకుంటుంది. కాబట్టి ప్రయోజనం తాత్కాలికమే’ అని మరికొందరు వ్యాఖ్యానించారు. ‘దీన్ని ఎక్కువసేపు చూస్తే పిచ్చెక్కిపోతుంది!’ అంటూ మరికొందరు సరదాగా స్పందించారు. మొత్తంగా, గోస్ట్ ఫాంట్ ఏఐ యుగంలో డిజిటల్ గోప్యతను కాపాడేందుకు రూపొందించిన ఆసక్తికరమైన ప్రయోగంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఏఐ సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో చూస్తే, ఈ రక్షణ ఎంతకాలం నిలుస్తుందన్నది భవిష్యత్తే నిర్ణయించనుంది.