గ్రహాన్ని మింగేసిన నక్షత్రం..

Graham

 1,300 కాంతి సంవత్సరాల దూరంలో ఖగోళ రహస్యం

భూమికి సుమారు 1,300 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సూర్యుడిని పోలిన టిఓఐ -5882 అనే నక్షత్రం తన చుట్టూ తిరుగుతున్న ఒక గ్రహాన్ని మింగేసిందని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ గ్రహం పూర్తిగా నక్షత్రంలో కలిసిపోయినా, దాని ఆనవాళ్లు రసాయనిక సంకేతాల రూపంలో మిగిలిపోవడంతో ఈ అరుదైన సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ పరిశోధన ఫలితాలు ది ఆస్ట్రోఫీజికల్ జర్నల్ లో ప్రచురించబడ్డాయి. ఈ అధ్యయనానికి బ్రూక్ కొట్టేన్ నాయకత్వం వహించగా, అమెరికా,చిలీకి చెందిన 14 మంది శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు.ఈ ఆవిష్కరణలో ప్రధాన పాత్ర పోషించిన మూలకం లిథియం. సాధారణంగా నక్షత్రాల్లో లిథియం చాలా తక్కువగా ఉంటుంది. కానీ గ్రహాల్లో మాత్రం ఇది ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఒక నక్షత్రం గ్రహాన్ని మింగినప్పుడు, ఆ గ్రహంలోని లిథియం నక్షత్ర వాతావరణంలో కలిసిపోతుంది.

శాస్త్రవేత్తలు స్పెక్ట్రోస్కోపీ అనే సాంకేతికతతో టిఓఐ -5882 నుంచి వెలువడుతున్న కాంతిని విశ్లేషించారు. దానిలో అసాధారణంగా అధిక లిథియం స్థాయిలు కనిపించాయి. దీన్ని నిర్ధారించడానికి అదే వయస్సు, ద్రవ్యరాశి, ఉష్ణోగ్రత కలిగిన మరో 62 నక్షత్రాలతో పోల్చారు.

ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. టిఓఐ -5882 లిథియం పరిమాణం పరంగా పరిశీలించిన నక్షత్రాల్లో అత్యధిక స్థాయిలో ఉండి, కనీసం 97 శాతం సమాన నక్షత్రాల కంటే ఎక్కువ లిథియం కలిగి ఉన్నట్లు తేలింది.

కనిపించకుండా పోయిన గ్రహం ఎంత పెద్దది?

లభించిన ఆధారాల ప్రకారం, ఆ గ్రహం భూమి కంటే కొన్ని రెట్లు పెద్దదిగా ఉండి, పరిమాణంలో నెప్ట్యూన్ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఈ ఘటన ఎలా జరిగి ఉండొచ్చు?

సాధారణంగా నక్షత్రాలు తమ జీవితాంతంలో రెడ్ జెయింట్ దశలోకి ప్రవేశించినప్పుడు సమీప గ్రహాలను మింగేస్తాయి. కానీ TOI-5882 ఇంకా ఆ దశకు చేరుకోలేదు. అందువల్ల ఈ సంఘటన మరింత ఆసక్తికరంగా మారింది.

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఈ నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భారీ బ్రౌన్ డ్వార్ఫ్ (గోధుమ మరుగుజ్జు నక్షత్రం) ఇందుకు కారణమై ఉండవచ్చు. ఇది జుపిటర్ కంటే 20 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి కలిగి ఉంది. దాని గురుత్వాకర్షణ ప్రభావం వల్ల ఆ గ్రహం కక్ష్య మారి, చివరకు నక్షత్రం వైపు లాగబడి అందులో కలిసిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.

మన సౌర కుటుంబానికి హెచ్చరిక?

ఈ పరిశోధన మన సౌర కుటుంబ భవిష్యత్తుపై కూడా ఒక ఆసక్తికరమైన సంకేతాన్ని అందిస్తోంది. మరో 5 బిలియన్ సంవత్సరాల తర్వాత సన్ రెడ్ జెయింట్‌గా మారినప్పుడు మెర్క్యూరీ, వీనస్ ను మింగేయడం దాదాపు ఖాయమని, అలాగే ఎర్త్ కూడా ఆ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.