సంచలన ఆవిష్కరణ
సౌర కుటుంబానికి ఆవల ఉన్న అంతరిక్ష రహస్యాలను ఛేదించే క్రమంలో ఖగోళ శాస్త్రవేత్తలు మరో కీలక విజయాన్ని సాధించారు. భూమికి సుమారు 57 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ వింత గులాబీ రంగు గ్రహం (పింక్ ప్లానెట్) వాతావరణంలో ఉప్పు మేఘాలు ఉన్నట్లు గుర్తించారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నిర్వహిస్తున్న అత్యాధునిక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో ఈ అరుదైన ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది.
ఖగోళ శాస్త్రవేత్తలు జీజే 504బీ గా పిలిచే ఈ గ్రహాన్ని మొదటిసారిగా 2013లో గుర్తించినప్పటికీ, దాని వాతావరణం, రసాయన నిర్మాణం వంటి కీలక వివరాలు ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. తాజాగా జరిపిన పరిశోధనలతో ఈ గ్రహానికి సంబంధించిన అనేక కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఈ అధ్యయన ఫలితాలను ది ఆస్ట్రానమికల్ జర్నల్ ప్రచురించింది.
జుపిటర్ కంటే దాదాపు 25 రెట్లు అధిక ద్రవ్యరాశి కలిగిన ఈ గ్రహం నుంచి వెలువడే కాంతి చాలా బలహీనంగా ఉండటంతో భూమిపై ఉన్న టెలిస్కోపుల ద్వారా దానిని అధ్యయనం చేయడం శాస్త్రవేత్తలకు ఎన్నో సంవత్సరాలుగా సవాలుగా మారింది. అయితే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అత్యంత సున్నితమైన పరిశీలన సామర్థ్యంతో ఈ సమస్యను అధిగమించింది.
అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధక బృందం ఈ అధ్యయనానికి నాయకత్వం వహించింది. భారతీయ మూలాలున్న ఖగోళ శాస్త్రవేత్త అనీష్ బాబురాజ్ ఈ పరిశోధనలో కీలక పాత్ర పోషించారు. గతంలో భారీ టెలిస్కోపులతో రాత్రంతా పరిశీలించినా దొరకని వివరాలను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కేవలం రెండు గంటల్లోనే అందించిందని ఆయన తెలిపారు.
టెలిస్కోప్ సేకరించిన స్పెక్ట్రమ్ డేటాను విశ్లేషించగా, ఈ గ్రహ వాతావరణంలో నీరు, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, అమ్మోనియా వంటి రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ డేటా ఇప్పటివరకు ఉన్న వాతావరణ నమూనాలకు సరిపోకపోవడంతో శాస్త్రవేత్తలు మరింత లోతుగా పరిశీలించారు. చివరికి అక్కడ ఉప్పు మేఘాలు ఉండవచ్చనే అంచనాకు వచ్చారు.
మూడు రకాల మేఘాల నమూనాలను పరిశీలించిన అనంతరం ఉప్పు మేఘాల నమూనా మాత్రమే జేమ్స్ వెబ్ పంపిన స్పెక్ట్రమ్ సమాచారంతో పూర్తిగా సరిపోలినట్లు తేలింది. వాతావరణంలో లోతుగా విస్తరించిన ఈ ఉప్పు మేఘాలు ఇతర రసాయన సంకేతాలను కప్పివేయడం వల్లే ఇప్పటివరకు ఈ గ్రహ రహస్యాలు వెలుగులోకి రాలేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
విశ్వంలోని గ్రహాల స్పెక్ట్రమ్ విశ్లేషణలో ఉప్పు మేఘాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిర్ధారణ కావడం ఇదే తొలిసారి. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో ఇతర సౌర కుటుంబాల గ్రహాల వాతావరణాలను అర్థం చేసుకునేందుకు కొత్త మార్గాలను తెరుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
సుమారు 250 కోట్ల నుంచి 400 కోట్ల సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఈ గ్రహం ప్రస్తుతం దాదాపు 290 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కలిగి ఉంది. గ్యాస్ జెయింట్ గ్రహాలు కాలక్రమేణా చల్లబడే ప్రక్రియకు ఇది ఒక ఆసక్తికర ఉదాహరణగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ అసాధారణ ఆవిష్కరణతో ఖగోళ భౌతిక శాస్త్రంలో కొత్త చర్చలకు తెరలేచింది.
